తెలంగాణలో ఏదీ గట్టి ప్రత్యామ్నాయం?

TS Assembly
TS Assembly

తెలంగాణలో ఏదీ గట్టి ప్రత్యామ్నాయం?

అసెంబ్లీలో బుల్డోజ్‌ చేసిన అధికార పార్టీ విపక్షాల వైఫల్యం
అసెంబ్లీ సమావేశాలు తేల్చిన వాస్తవాలు

కోనేటి రంగయ్య / హైదరాబాద్‌

రికార్డు స్థాయిలో 18 రోజుల పాటు జరిగిన తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాల సరళిని పరిశీలిస్తే మరో రెండున్నర ఏళ్ల నాటికి కూడా అధికార పార్టీకి గట్టి ప్రత్యామ్నాయ పార్టీ ఏదీ? ఎక్కడ? అని శోధించాల్సిన అవసరం కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి కూడా ప్రస్తుత రాజకీయ పక్షాలేవీ పాలక పక్షాన్ని దీటుగా ఎదుర్కొనే సత్తాను పునికి పుచ్చుకునే అవకాశాలు లేనట్లుగా సభలో వాటి పనితీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తన కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు మంచి వేధికగా అసెంబ్లీ సమావేశాలు ఉపకరించగా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు నీరుకారి పోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

తెలంగాణలో అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నందున విపక్షాల వాదనకు అవకాశం లేని పరిస్థితి ఉందని పాలక పార్టీ శాసనసభ్యులు సగర్వంగా ప్రకటించుకోవడంతోనే ప్రతిపక్షాల వైఫల్యం మరింత స్పష్టమైంది. పైగా తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల్లో ఐక్యత కొరవడటంతో ప్రభుత్వం తన కార్యక్రమాలన్నింటికి ప్రచారానికి ఈ సమావేశాలను విజయవంతంగా వినియోగించు కుంది. తెలంగాణ రాష్ట్ర సమితికి కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడిన అనుబంధంతో బిజెపి రూపేణ మరో మిత్ర పక్షం కలిసి రావడంతో అది పాలక పక్షానికి అదనపు ప్రయోజనంగా మారింది. సాధారణంగా చట్ట సభల సమావేశాల్లో ప్రజల సమస్యలను గట్టిగా ప్రస్తావించి, పాలక పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు పట్టుబట్టి ప్రజల్లో ఆదరణను పెంచుకునేందుకు ప్రతిపక్షాలు ఆ సభలను వేధికలుగా ఉపయోగించుకుంటాయి. కానీ తెలంగాణ శీతకాల అసెంబ్లీ సమావేశాలు ఇందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అధికార పక్షమే మొత్తం బుల్డోజ్‌ చేసినట్లుగా చర్చల సరళి కొన సాగి, విపక్షాలు నామమాత్రంగా మిగిలి పోయాయి. సభలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకుంటున్నా, అది పార్టీ చేతకానితనంగానే విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అతి తక్కువ సంఖ్యాబలం ఉన్న టిడిపి, వామపక్షాలు వల్ల పెద్దగా ప్రభావం చూపలేని దుస్థితిలో పెద్దన్న పాత్ర వహించాల్సిన కాంగ్రెస్‌ కుంటినడక సభలో పాల కపక్షాన్ని ఉపకరించింది. ఎంఐఎం, బిజెపి పార్టీలు కొన్ని సందర్భాల్లో విమర్శలు చేసినస్పటికీ అవి దాదాపుగా మిత్రపక్షాలుగానే మిగిలిపోయినట్లుగా సభా కార్యక్రమాలు సాగాయి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన కొద్ది నెలల్లోనే అభివృద్ధికి బాటలు వేసినట్లుగా, దేశ, విదేశీ కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, ప్రభుత్వ పరంగా కూడా లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతున్నదని, భారీ నీటిపారుదల రంగానికి పెద్ద యెత్తున నిధులు వెచ్చించి ప్రాజ ెక్టుల పునరాకృతితో కోటి ఎకరాలను సాగు నీరందించేలక్ష్యంతో పనులు జరుగుతున్నాయని పాలక పక్షం సభలో వివరించింది.

ప్రాజెక్టుల నిర్మాణానికి పైసా అప్పు తేలేదని వెల్లడించారు. మరో బృహత్తర ప్రాజెక్టు ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం వాగ్దానం మేరకు సకాలంలో పూర్తి చేసి వచ్చే ఎన్నికల నాటికి సుసాధ్యం చేస్తున్నట్లుగా ప్రకటించారు. భగీరథ పథకానికి నిధుల కొరత సమస్య లేకుండా రుణాలు స్వీకరిస్తున్నామ న్నారు. డబుల్‌ బెడ్‌ రూపం పథకం అమలుకు ఇబ్బందులున్నా, ప్రణాళికా బద్ధంగా కార్యా చరణ ఉంటుందన్నారు. అటవీ సంపదను పరిరక్షించుకోవడానికి హరిత హారం భారీగా చేపట్టా మన్నారు. మైనారిటీలకు రిజర్వేషన్లు, ఇతర సదుపాయాలు, బిసిలకు ముఖ్యంగా గొర్రెల పెం పకం, చేపల పెంపకం వంటి కార్యక్రమాలను వివరించడంతోపాటు వాటికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వల్ల వెనుకబడిన వారికి ఎంతోమేలు జరుగుతుందని ప్రత్యేకచర్చల ద్వారా పాలక పక్షం సవివరంగా వెల్లడించింది. పైగా కీలక సమయాల్లో నేరుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జోక్యం చేసుకున్నారు. నేరుగా ప్రకటనలు చేయడంతోపాటు…పూర్తి స్థాయి వివరణలు ఇచ్చారు. హరితహారం, బిసిలకు కార్యక్రమాలు, మైనారిటీ సంక్షేమంపై కెసిఆర్‌ చర్చల్లో పాలు పంచుకున్నారు. అయితే టిఆర్‌ఎస్‌ ఎన్నికల వాగ్దానాలైన కెజి టు పిజి విద్య కార్యక్రమం, బడుగు, బలహీన వర్గాలకు సాగుభూముల కల్పన కార్యక్రమాలపై కొంత తక్కువగా మాట్లాడిన ప్పటికీ ఇతర అన్ని కార్యక్రమాలపై జరిగిన చర్చల్లో పాలకపక్షానిదే పూర్తి స్థాయిలో పై చేయి అయింది.

ఈ చర్చల సందర్భంగా ప్రభుత్వం చెబుతున్న అంశాలపై లోటుపాట్లను ఎప్పటిక ప్పుడు ప్రస్తావించి యధార్థ పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రతిపక్షాలు సమర్థవంతంగా వ్యవహ రించలేదనే అప్రతిష్ఠను మూటకట్టుకున్నాయి. ఈ మేరకు తగిన కసరత్తు చేయలేక పోయాయని భావిస్తున్నారు. తెలంగాణలో పెద్దయెత్తున ఉద్యోగాల కల్పన జ రుగుతున్నదని పాలక పక్షం సభలో ప్రస్తావించినప్పటికీ ఇప్పటివరకు పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా జరిగిన నియామకాలు ఆరేడు వేలకు మించ లేదు. దాదాపు లక్షఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఇవ్వడం కష్టసాధ్యమే. అయితే ఈ విషయంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో వాస్తవాలపై విపక్షాలు మరింత గట్టిగా నిలదీసే అవకాశం ఉన్నా, ఏ పక్షం తగిన విధంగా వ్యవహరిం చలేకపోయింది. పెట్టుబడులు, పరిశ్రమలు కూడా సభలో చెప్పిన స్థాయిలో ఆచరణలో కనిపించడం లేదని ఒప్పందాలు జరిగినప్పటికీ అవి అన్నీ వాస్తవ రూపం దాల్చడానికి అధిక సమయమే పడుతుందని అంటున్నారు. టిఆర్‌ఎస్‌ మరో బృహత్తర కార్యక్రమం ఎస్సీ, ఎస్టీలకు సాగుభూమిని అవసరమైతే కొను గోలు చేసి పంపిణీ చేయడం…కానీ ఈ పథకం ఆరంభ దశలోనే ఉంది. ఈ వాస్తవాన్నికూడా విపక్షాలు ఉపయోగించుకోలేకపోయాయి. అందరికీ విద్య.. కెజి టు పిజి కార్యక్రమాన్ని గురుకులాలను విస్తరించడం ద్వారా అమలు చేస్తు న్నట్లుగా ప్రభుత్వం వెల్లడిస్తున్నది. ఈ విషయంలోనూ ప్రతిపక్షాలు ధ్వజ మెత్తలేని దుస్థితిలో మిగిలిపోయాయి.

డబుల్‌ బెడ్‌రూం నిర్మాణం జరుగతున్న తీరు తెన్నులు పరిశీలిస్తే భారీగా నిధుల కొరత ఉన్నందున అది ఎప్పటికి పూర్తి అవుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇరిగేషన్‌కు పైసారుణం తీసుకోలేదని ప్రభుత్వం సాంకేతికంగా చెబుతున్నా వాస్తవ విషయాన్ని ఏ పక్షం ప్రస్తావించలేకపోయింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రతిసంవత్సరం తీసుకునే రుణంలో సింహ భాగం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికే వ్యయం చేయ డం పరిపాటి. దీనికి ఇరిగేషన్‌పై ప్రేమ లేకపోయినా ప్రభుత్వాలు ఇది తప్పని పరిస్థితి. రుణాలుగా తీసుకున్న మొత్తాలను పెట్టుబడి వ్యయంగా చూపాల్సిన నిబంధనల మేరకు ప్రభుత్వం అప్పు మొత్తాలను ఎక్కువగా ఇరిగేషన్‌ రంగంలో వ్యయంచేస్తుంటాయి.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఇరిగేషన్‌కు నేరుగా ఒక్క పైసా రుణం స్వీకరించకపోయినా.. ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటున్న 21 వేల కోట్లకు పైగా రుణంలో ఈ శాఖలోనే అధికంగా వ్యయం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ అప్పులు అధికంగా ఇదే శాఖలో ఖర్చు చేశారు. విపక్షాలు తగిన ప్రణాళికతో అసెంబ్లీని ఎదుర్కోలేకపోవడంతో పాలక పక్షం విజవంతంగా తమ ప్రచార వేధికగా దానిని వినియోగించుకుంది.