తుమ్మ చెట్టు – పూల మొక్కలు

నీతికథ

TREE
TREE

తుమ్మ చెట్టు – పూల మొక్కలు

ఒక చేల్లో పెద్ద తుమ్మ చెట్టు ఉంది. దాని చుట్టూ పూల మొక్కలు నాటారు. కొద్దికాలంలో అవి పెద్దవయ్యాయి. పూలు పూసాయి. మొక్కల నిండా పూలు కమ్మటి పరిమళాన్ని వెదజల్లసాగాయి. అరవిరిసన ఆ పూలన్నీ ముచ్చటగా ఉండి ముద్దొస్తున్నాయి. పూలు ఉన్న కొమ్మలు గాలికి ఊగుతుంటే పూలు వయ్యారాలు పోవడం చూసినవారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. అందరూ పూలమొక్కల వద్దకు వచ్చి పూలను సుతారంగా తాకి మృదువ్ఞగా పట్టుకుని వాసన చూసి వెళుతున్నారు. ఇదంతా తుమ్మచెట్టు చూస్తుంది. ఈర్ష్య కలిగింది. మూన్నాళ్లుండే ఈ పూలకే ఇంత కులుకు ఉంటే, కలకాలం ఉండే నాకెన్ని హొయలు ఉండాలి. వీటి అంతు చూడాలి. వీటిని నలిపి వేయాలి అని మనసులో వాటిపై కసి పెంచుకుంది. ఇంకెన్నాళ్లులే రేపోమాపో వీటిని కోసేయరు అనుకుని తనను తాను ఊరడించుకుంది. అది అనుకున్నట్లుగానే పూలను కోశారు.
గంపలకెత్తారు. పట్నం పంపారు. తోటంతా మోడువారింది. అప్పటి వరకు కాంతులు జల్లుతున్న ఆ తోట కళావిహీనమయింది. పీడా వదిలింది అనుకుంది తుమ్మచెట్టు. అప్పుడే ఒక తుమ్మెద వచ్చింది. చెట్టుకొమ్మపై వాలింది. తుమ్మ గొణుగుడు విన్నది. ‘ఓసి తుమ్మ మొద్దా! పూలు తమ చెట్టుపై ఉండేది రెండు మూడు రోజులే అది బ్రతికేది తక్కువ కాలమే. నిజమే కానీ, వాటి వైభవం చూడు. కొన్నేమో దేవ్ఞని పూజకు వెళతాయి. మరికొన్ని మమాత్ములకు వేసే గజమాలలో చేరతాయి. ఇంకొన్ని మాతృమూర్తుల శిరసులు అలంకరిస్తాయి. అంతటి భాగ్యం వాటిది. ఆ స్థితి మనకుందా? ఎన్నాళ్లు బ్రతికాం అనేది కాదు ముఖ్యం. ఎంత వైభవంగా జీవించాం అనేది కావాలి. పరులకెలా ఉపయోగపడ్డాం అని ప్రశ్నించుకోవాలి. కాకిలా కలకాలం బ్రతకటం కాదు, కోకిలలా ఒక్కరోజు బ్రతికినా చాలు. పూలు ఎంత పుణ్య చేసుకుంటేనో భూమి మీదకు వచ్చాయి. ఉన్నన్నాళ్లు అందరిని ఆనంద పరుస్తున్నాయి. పరిమళం వెదజల్లుతూ పరవశింపచేస్తాయి. పట్టుపాన్పులపై పవళింప చేస్తాయి. వాటికున్న గొప్పతనం మనకెక్కడుంది? అంది తుమ్మెద. తుమ్మ చెట్టు తన తప్పు తెలుసుకున్నది.

– దార్ల బుజ్జిబాబు, చిలకలూరిపేట