తాళికట్టిన భగవాన్‌ సత్యసాయి

sathya sai
sathya sai

తాళికట్టిన భగవాన్‌ సత్యసాయి

ఎప్పుడూ చెడును చూసే కండ్లు, చెడును వినే చెవులు, చెడును మాట్లాడే నోరు, చెడును చింతించే మనసు ఉన్నవారిని ”తాళికట్టిన భగవాన్‌ సత్యసాయి అనే శీర్షిక ఎంత బాగా ఆకర్షిస్తుందో సర్వసంగ పరిత్యాగి, కాషాయవస్త్రాన్ని ధరించే బాబా పెండ్లి చేసుకొన్నాడా? ఎక్కడ? ఎప్పుడు? ఎవడో బాగా పరిశోధన చేసే, ఆధారాలను సేకరించే జర్నలిస్ట్‌ ఈ విషయాన్ని ఇప్పుడు, బయటపెడుతున్నట్టున్నాడు. దీన్ని అన్ని పనులను పక్కన పెట్టి, ఇప్పుడే, ఇక్కడే, ఇట్లే చదవాల్సిందే అని అనుకొంటారు. ఎలాగైతేనేం, చదివించాలన్నదే నాతలంపు. అది మంచిదో, కాదో ఆ సాయినాధుడే తేల్చాలి. ఔను, బాబా వారు తాళి కట్టారు. ఎప్పుడు? 1982లో దేశరాజధాని న్యూఢిల్లీలో. ఎవరి మెడలో? సీతాదేవి మెడలో. రహస్యంగానా? కాదు, బహిరంగానే, లక్షలమంది సమక్షంలో ఫోటో కూడా ఉంది. ముందు మీరు తెలుసుకోవలసింది నేను పరిశోధన చేసి సంచలన వార్తలను అందించే జర్నలిస్ట్‌ను కానని- నేను పరిశోధించేది, బాబా వారి చరిత్ర-సత్యం, శివం,సుందరం-ఏడు సంపుటాలు సాయి వచనామృతం – 30 సంపుటాలు. అంతే.
ఇక బాబా కట్టిన తాళి విషయం తెలుసుకోవాలన్న తొందర ఉందిగా? భగవాన్‌ శ్రీసత్యసాయి బాబా వారి దివ్య జీవిత చరిత్ర (1994-2001) సత్యం,శివం,సుందరం- ఏడవ భాగం అందిస్తుంది. ఆ సమాచారాన్ని ఇలా- ” దైవభక్తి కేంద్ర బిందువ్ఞగా, దేశవ్యాప్తంగా వివిధ సాంఘిక, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిచటం ద్వారా జాతీయ సమైక్యతనూ సామాజిక సుహృద్భావన, సామరస్యలతనూ పెంపొందించటమే ప్రధాన లక్ష్యముగా 1981లో ”భారత్‌ కల్చరల్‌ ఇంటెగ్రేషన్‌ కమిటీని స్థాపించటం వెనుక, వాస్తవానికి భగవాన్‌ బాబా వారి ప్రేరణ, దివ్య మార్గ నిర్ధేశనముల పాత్ర ప్రధానమైనదని శ్రీ శాస్త్రిగారు (బిసిఐసి ఫౌండర్‌ కన్వీనర్‌) తరచూ జ్ఞాపకం చేసుకొంటూ ఉంటారు. 1982లో న్యూఢిల్లీలో నిర్వహించబడిన ఆ కమిటీవారి ప్రప్రథమ కార్యక్రమమైన ‘శ్రీసీతారామ సంగీతోత్సవమునకు భగవాన్‌ బాబా వారు స్వయంగా హాజరై, తమ దివ్య సమక్ష భాగ్యమును వారికనుగ్రహించారు. ఆ సందర్భంలో కమిటీ వారు నిర్వహించిన శ్రీసీతారామ కల్యాణోత్సవంలో భగవానులు ఒక మంగళసూత్రమును సృజించి, దానిని స్వయంగా తమ దివ్య హస్తములతో ప్రతిమ రూపంలో ఉన్న సీతాదేవి కంఠమున అలంకరించారు.”(పుట 92-ఫోటోను కూడా అందులో చూడవచ్చు. బాబా వారు తాళి కట్టిన విషయంతో పాటు వారి ముఖ్య భోధను కూడా తెలుసుకొందాం అదీ ముఖ్యం. ‘ఉన్నది ఒకే కులం, అది మానవ కులం! ఉన్నది ఒకే మతం, అది ప్రేమ మతం! ఉన్నది ఒకే భాష, అది హృదయ భాష! ఉన్నది ఒకే భగవంతుడు. అతడు సర్వవ్యాపి! (పుట 31-సత్యం, శివం, సుందరం-నాల్గవ భాగం) ఓం సాయిరాం! సాయిరాం.

– రాచమడుగు శ్రీనివాసులు