తాము చేస్తోన్న ఉద్యమానికి పవన్ మద్దతు పలుకాలి..అవంతి
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా పోరాడాలి
avanthi srinivas
విశాఖ: విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి స్పందించారు. విశాఖలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ… ఉక్కు పరిశ్రమపై ఈ రోజు వైఎస్ఆర్సిపి ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుస్తున్నారని తెలిపారు. అంతేగాక, ఆ విషయంపై త్వరలోనే ప్రధాని మోడిని కూడా వారు కలుస్తారని చెప్పారు.
తాము చేస్తోన్న ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తమతో కలిసి పోరాటం చేయాలని ఆయన అన్నారు. భూములు కాజేయాలని పోస్కో ప్రయత్నాలు జరుపుతోందని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం వంటి ప్రజల ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే హక్కు ప్రభుత్వాలకు ఉండబోదని ఆయన చెప్పారు. కాగా, విశాఖ ఉక్కు కర్మాగారం వద్ద కార్మికులు ఈ రోజు దీక్షకు దిగారు. ప్రైవేటీకరణ వద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. వారికి మంత్రి అవంతి శ్రీనివాస్ మద్దతు తెలిపారు.