తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై అనుచ‌రుల‌తో చ‌ర్చించిన శ‌శిక‌ళ‌?

sasikala
sasikala

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ పెరోల్‌పై బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన భర్తను చూసేందుకు శశికళకు ఐదు రోజులు పెరోల్ ఇచ్చిన విషయం తెలిసిందే. శశికళ నిన్న అస్ప‌త్రికి వెళ్లి భర్త నటరాజన్‌ను కలిసారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాలంటూ ఆమె వైద్యులవద్ద వాకాబు చేశారు. ఈ సందర్భంగా శశి కంటతడి పెట్టినట్లు సమాచారం. అనంత‌రం తన అనుచరులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కొందరు అనుచరులు అయితే ఆమె పిలవకుండానే వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. శశికళ వారితో తాజా రాజకీయ పరిస్థితులను చర్చిస్తున్నారు. పళనిస్వామి ప్రభుత్వ తీరును ఆమె అడిగి తెలుసుకుంటున్నారు. పళనిని వెనుకుండి నడిపిస్తున్నదెవరని ఆమె ఆరా తీస్తున్నారు. మ‌రోవైపు శశికళ నివాసంపై కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టినట్లు తెలియవచ్చింది. పెరోల్ నిబంధనలను ఆమె ఉల్లంఘించిన పక్షంలో వెంటనే బెంగుళూరు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఇంటెలిజెన్స్ వర్గాలకు ఆదేశాలు అందాయి. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని శశికళను జైలు అధికారులు గట్టిగా హెచ్చరించారు. ఇప్పుడు ఆమె తన అనుచరులతో భేటీ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఎలాంటి నివేదిక వెళుతుందో చూడాలి.