తల్లి నేల పిలుపు

నీతి కథ

SANKRANTI-1

తల్లి నేల పిలుపు

ఒక గ్రామంలో రాజయ్య వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాడు. రాజయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఢిల్లీలో తన కుటుంబంతో ఉంటున్నాడు. ఇక చిన్న కొడుకు ఉండేది కొచ్చిన్‌లో. ఇద్దరు కొడుకులకూ ఇద్దరు ఇద్దరు బిడ్డలున్నారు. అంటే రాజయ్య కుటుంబ సభ్యులు మొత్తం ఎనిమిది మంది. రాజయ్య దంపతులతో కలసి పది మంది అన్నమాట! అయితే ఏం లాభం! గ్రామంలో ఉండేది రాజయ్య దంపతులు ఇద్దరే! సంక్రాంతి పండుగకైనా తన ఇద్దరు కొడుకులూ, వాళ్ల కుటుంబాలూ వస్తాయని రాజయ్య దంపతులు తమ కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తూంటారు.

ఫలితం లేదు. పండుగలు వస్తున్నాయి. వెళుతున్నాయి కాని, రాజయ్య ఇంట్లో బిడ్డలు తిరుగాడిన కళ లేనే లేదు. రాజయ్యకు గానీ, ఆయన భార్యకు గానీ ఎలాంటి జబ్బు చేసినప్పటికీ ఆయన కొడుకులకు మనస్సులు కరిగేవి కావ్ఞ. చరవాణుల వంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానంతోనే రాజయ్య దంపతుల ముచ్చట తీర్చేవారు కొడుకులు. త్వరలో మరో సంక్రాంతి పండుగ రానుంది. రాజయ్యను సమీపించి, ఈ సంక్రాంతికి అయినా సరే మన కుటుంబ సభ్యులందరం ఇక్కడే గ్రామంలో గడపాలి! అంది భార్య. తన భార్య నుండి ఇటువంటి ఆవేశం కోసమే ఎదురు చూస్తున్నాడు రాజయ్య.

విశాఖపట్నం మనకు దగ్గర కాబట్టి అక్కడ నుండి విమానంలో ఇటు ఢిల్లీ, అటు కొచ్చిన్‌ వెళ్దాం. మన కొడుకుల బిడ్డలను వెంట బెట్టుకుని తిరుగు ప్రయాణమవ్ఞదాం అన్నాడు రాజయ్య. తన మనవళ్లకీ, మనుమరాళ్లకీ విమాన ప్రయాణం ఏర్పాటు చేసి మరీ బయలుదేరాడు రాజయ్య. రాజయ్య కొచ్చిన్‌ వెళ్లాడు. ఆయన భార్య ఢిల్లీ చేరుకుంది. తమ తమ ఇళ్లను చేరుకోబోయిన మనవళ్లనూ, మనవరాళ్లనూ వెంట బెట్టుకుని విశాఖపట్నం చేరుకున్నారు భార్యాభర్తలు. పిల్లలను విమానం ఎక్కించే ముందు తమ కొడుకులకు కబురు కూడా అందించారు. తమ తల్లీ తండ్రీ ఇటువంటి పని చెయ్యగలరని వాళ్ల కొడుకులు ఎన్నడూ ఊహించలేకపోయారు.

ఇక ఎప్పుడోగానీ తాము చూడని నాన్నమ్మా, తాతయ్యా తమ కోసం రావడంతో మనవళ్లూ, మనవరాండ్రూ ఎంతగానో ముచ్చటపడ్డారు. నిరభ్యంతరంగా వాళ్ల గ్రామం చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో వాళ్లకు పచ్చటి పొలాలు, నీటి కాలువలూ కనిపించాయి. అచ్చమైన తెలుగు పాటలు పాడుకుంటున్న రైతులూ, వ్యవసాయ కూలీలూ కనిపించారు.

స్వచ్ఛమైన చల్లటి గాలులకు వాళ్లు పులకరించిపోయారు. పైగా నాన్నమ్మా, తాతయ్యా తమ పట్ల చూపించే ప్రేమా, కరుణా, ఆప్యాయతా వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, భోగినాటి సంప్రదాయబద్ధమైన తలంట్లూ, కొత్త బట్టలు ధరించడం, భోగిమంట వద్ద అంత తెల్లవారుఝామున చలి కాగడం, గంగిరెద్దుల విన్యాసాలూ, కొమ్మదాసరుల గెంతులూ పిల్లలు మరో లోకంలోకి వచ్చినట్లు సంబర పడినారు. అంతేకాదు, గ్రామస్తులు అన్నదమ్ముల మాదిరి పలకరించుకోవడం, ఆహార పదార్థాలు ఇచ్చి పుచ్చుకోవడం, వాళ్లకు వింతగా కనిపించాయి.

అత్తెసరూ, పచ్చిపులుసూ వాటిలో నేతి చుక్కలూ వారికి కొత్త రుచులు అందించాయి. సంక్రాంతి, కనుమ నాడు ఎడ్ల పందేలూ, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలూ వారిని అలరించాయి. పండుగ అంటే తమ తాతయ్యగారి ఇంటనే అనిపిస్తోంది వాళ్లకు. అందువల్లే సంక్రాంతి నాడు గ్రామంలోకి వచ్చిన రాజయ్య కొడుకులకు తమ తల్లి నేల పిలుపు అతి మనోహరంగా వినిపించినట్లు అనిపించింది.

– బి.మాన్‌సింగ్‌ నాయక్‌, కారంపూడి