తగునా..ట్రంప్‌!

                              తగునా..ట్రంప్‌!

trump
trump

జ్రాయెల్‌ రాజధాని ఏది? అని ప్రశ్నిస్తే ఎవరైనా వెంటనే టెల్‌ అవివ్‌ అని సమాధానమిస్తారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం జెరూసలెం అంటున్నారు. ఇదెక్కడి చోద్యం! అంటే అసలే వివాదాల రొంపిలో ఉన్నజెరూసలెంను, పాలస్తీనాను, ఇజ్రాయెల్‌ను మరింత వివాదాల్లోకి నెట్టి వేయడమేగదా! రావణకాష్టంలా ఉన్న మధ్యప్రాచ్య మంటలను చేతనైతే చల్లార్చాలి గాని మరింతగా ఎగదోయడమేమిటి? దానివల్ల ట్రంప్‌కు కలిసొచ్చేదేమిటి? అరాఫత్‌ బతికి ఉన్న రోజుల నుంచి జెరూసలెంపై వివాదం నడుస్తూనే ఉంది. ఆయన కాలంలో అది పరిష్కారం కానేలేదు. ఆ తర్వాత మరో పుష్కర కాలం గడుస్తున్నా ఆ సమస్య పరిష్కారమయ్యే సూచనలే కనిపించడం లేదు. కాకపోగా ఇప్పుడు ఇదొక కొత్త కుంపటి. ట్రంప్‌ అనాలోచితంగా రగుల్చుతున్న కుపంటి. ఇజ్రాయెల్‌-పాలస్తీనా నడుమ దశాబ్దాలుగా నెలకొన్న చిచ్చును మరింత రెచ్చగొట్టడమంటే పశ్చిమాసియాలోమరింత కల్లోలం సృష్టించడమే. జెరూసలెం వివాదం ఎన్నో సంవత్సరాలుగా ఉన్నదనీ, ఆ వివాదానికి తెరవేస్తూ ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలెంను తాము గుర్తిస్తున్నామనీ ట్రంప్‌ గత బుధవారం (6, డిసెంబరు) ఒక ప్రకటన చేయడం అరబ్‌ దేశాలకు ఎంతో ఆగ్రహాన్ని కలిగించడమే గాక కొత్త చిచ్చును కూడా రగిల్చింది.

జెరూసలెంను పాలస్తీనాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు, వివిధ దేశాల్లోని క్రైస్తవ్ఞలు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తుం టారు. అలాగే ఇజ్రాయెల్‌లోని యూదులు కూడా తమ పవిత్ర ప్రదేశంగా జెరూసలెంను భావిస్తుం టారు. అటువంటి మూడు మతస్థులకు చెందిన కీలకమైన ప్రాంతాన్ని అమెరికా ఇప్పుడు ఏకపక్షంగా ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించడమంటే మధ్య ప్రాచ్యంలో మంటలను మరింతగా ప్రజ్వరిల్ల చేయ డమే. అంతేగాక ఇజ్రాయెల్‌కు అధికార రాజధానిగా ఉన్న టెల్‌అవివ్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించడానికి కూడా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా తాము ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆయన చెబుతున్నారు గాని అది పూర్తిగా అవాస్తవమే. పాలస్తీనా సమస్యకు తాను పరిష్కారం కనుగొంటానని ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు.అంతేగాని జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా ప్రకటిస్తానని ఎప్పుడూ చెప్పనేలేదు. కాని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతా న్యాహుకు ఇచ్చిన హామీ మేరకు ట్రంప్‌ ఈ ప్రక టన చేసి ఉంటారని విశ్లే షకులు భావిస్తున్నారు. ట్రంప్‌ ప్రకటన వెలు వడగానే సౌదీ రాజు సల్మాన్‌ ఒక ప్రకటన చేస్తూ ముస్లింల మనో భావాలను రెచ్చగొట్టవద్దం టూ హెచ్చరించారు. ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా కూడా అదే ధోరణిలో స్పందించారు.

ఇంకా పలు ముస్లిం దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. భారత్‌ కూడా అదే బాటలో ప్రకటన చేసింది గాని ట్రంప్‌ నిర్ణయాన్ని తప్పుపట్టలేకపోయింది. ట్రంప్‌ ప్రణాళిక చాలా ప్రమాదకరమనీ, పూర్తిగా రెచ్చగొట్టే విధంగా ఉన్నదనీ ఇరాన్‌ అధ్యక్షుడు రౌహనీ కూడా హెచ్చ రించారు. అలాగే టర్కీ, మరికొన్ని ముస్లిం దేశాల అధినేతలు కూడా ట్రంప్‌ నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే ఎవరెన్ని చేసినా ట్రంప్‌ మాత్రం తన నిర్ణయంలో మార్పులేదంటు న్నారు. వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం దానిలో మార్పుండదని చెప్పడం రెండూ చోద్యమే. అమెరికా అధ్యక్షుడుగా ఆయనకు ఇది తగునా! పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడితే దానికి రాజధానిగా తూర్పు జెరూసలెంను చేసుకోవాలని ఇన్నేళ్లుగా పాలస్తీనియన్లు భావిస్తున్నారు. ఆనగరం తూర్పు ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించిన విషయం కొత్తదేవిూ కాకపోయినా ఆక్రమిత ప్రాంతాన్ని రాజధానిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పడమే విడ్డూరం. యూదులు, ముస్లింలు, క్రైస్తవ్ఞలు తమ పవిత్ర నగరంగా ఒకే ప్రాంతాన్ని భావించడం కూడా అక్కడ ఒక చోటనే కనిపిస్తుంది. దానికి చారిత్రక కారణాలు అనేకం ఉన్నాయి. 1948 అరబ్‌- ఇజ్రాయెల్‌ యుద్ధలో పశ్చిమ జెరూసలెం ఇజ్రా యెల్‌ అధీనంలోకి వచ్చింది. అదే సమయంలో తూర్పు జెరూసలెంను జోర్దాన్‌ స్వాధీనం చేసు కొంది. ఆ తర్వాత 1967లో జరిగిన యుద్ధంలో జోర్దాన్‌ నుంచి జెరూసలెంను ఇజ్రాయెల్‌ తన అధీనంలోకి తెచ్చుకొంది. జెరూసలెం మొత్తంగా తనదే అనేది ఇజ్రాయెల్‌ వాదం. ఆ నగరం కోసం ఇజ్రాయెల్‌తో ఇరుగుపొరుగు దేశాలు అనేకమార్లు యుద్ధాలు చేశాయి కూడా.

1993లో కుదిరిన ఓస్లో ఒప్పందం తర్వాత జెరూసలెం తూర్పు ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ తన సేనలను ఉపసంహరించుకోవలసి ఉన్నా అలా జరగకపోవడంతో అక్కడ రావణకాష్టం అప్పటి నుంచి రగులుతూనే ఉంది. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌, 2009 నుంచి బరాక్‌ ఒబామా ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య శాంతికి అనేక ప్రయత్నాలు చేశారుగని అవి నేటికీ కొలిక్కిరానేలేదు. ఈ దశలో ట్రంప్‌ జెరూసలెం ఇజ్రాయెల్‌దే అనడం అగ్నిలో ఆజ్యం పోయడమే అవ్ఞతుంది. ట్రంప్‌ తన ప్రకటనపై ముందుకు వెళ్లకుండా ఉంటే కనీసం యధాతథస్థితి అయినా కొనసాగి కొంతమేర పరిస్థితి అదుపులో ఉంటుంది. పోప్‌ ఫ్రాన్సిస్‌ చెప్పినట్లు సమస్యను పరిష్కరించలేకపోతే కనీసం యధాతథస్థితిని కొనసాగించడమే ఉత్తమం. ట్రంప్‌ తన దుందుడుకు విధానాలకు ఇప్పటికైనా స్వస్తి చెప్పడం అవసరం.
– ఎ.వి.వి. ప్రసాద్‌