తక్కువ స్థాయి వారితో పోల్చుకోవాలి

muslim ladies
muslim ladies

తక్కువ స్థాయి వారితో పోల్చుకోవాలి

‘గొప్ప ఆలోచనలు లేనివాడు ఎంత సంపాదించినా ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉంటాడు అన్నాడు హారిసని. అసంతృప్తి లేనిది మనిషికి కాని, జాతికి కాని అభివృద్ధికి అడ్డంకి అని ఆస్కార్‌మైల్డ్‌ అన్నాడు. వ్యాధిగ్రస్తుడు, అసమర్ధుడు అతితేలికగా అసంతృప్తికి గురౌతాడు. నేడు సమాజంలో ఎటుచూసినా ఏదో వెలితి కనబడుతుంది ప్రతి ఒక్కరిలో. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే అసంతృప్తి ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. నేడు సమాజంలో స్థిరచరాస్తులు దండిగా గలవారినే ధనవంతులంటున్నారు.

నిజం చెప్పాలంటే ఇవన్నీ నిజమైన ధనం కాదు. నిజమైన ధనం సంతృప్తిలోనే ఉంది. ఇంద్రియ నిగ్రహం, ఆత్మసంతృప్తి గలవాడే నిజమైన ధనవంతుడు. ఒకసారి షేక్‌ సాది(ర) అనే పండితుడు కాలినడకన ప్రయాణం చేస్తూ ఒక ఊరు చేరుకున్నాడు. ఈ లోపు ఆయన కాలిజోళ్లు తెగిపోయాయి. కొత్తవి కొందామంటే జేబులు ఖాళీ అయ్యాయి. కొత్త ఊరులో కాళ్లకు చెప్పులు లేకుండా ఎలా నడవాలి అని ఆ పెద్దాయన చాలా బాధపడ్డారు. ఇంతలోనే కాళ్లులేని ఓ యాచకుడు నేలపై పాకుతూ తారసపడ్డాడు. ఆ దృశ్యాన్ని చూచిన షేక్‌గారికి వెంటనే జ్ఞానోదయమైంది. తన కాళ్లకు చెప్పులు లేనంతమాత్రాన ఇంతగా బాధపడాలా! ఎదుటి వ్యక్తి రెండు కాళ్లు లేకున్నా ఎంతో మనోధైర్యంతో పోతున్నాడే! తన కాళ్లకు చెప్పులు లేకపోతేనేం సలక్షణమైన రెండు కాళ్లను దైవం ప్రసాదించాడు.

కళ్ళు, ముక్కు, చెవ్ఞలు, నోరు తదితర ఎన్నో విలువైన అంగాలను ఆ విశ్వప్రభువ్ఞ తనకు ప్రసాదించాడు. వెంటనే ఈ భావన రాగానే సిగ్గుతో కుంచించుకుపోయాడు. దైవం పట్ల కృతజ్ఞతతో ఆయన మనసు నిండిపోయింది. వినమ్రతతో శిరస్సు అసంకల్పికంగా వంగిపోయింది. ఒక్కసారి మన దృష్టిని మన పరిసరాల్లోని ప్రజలను పరిశీలిస్తే కళ్లు లేని గుడ్డివాళ్లు, కాళ్లులేని కుంటివాళ్లు, మతిస్థిమితం లేని అమాయకులు, అనేక రకాల అంగవైకల్యాలతో అనుదినమూ కష్టాలు పడేవాళ్లు కనీసం ఒక్కపూట తిండికి కూడా నోచుకోని అభ్యాగ్యులు, జీర్ణవస్త్రాలతో, తలదాచుకోవడానికి గూడులేని వారు ఎందరో మనకు కనబడుతుంటారు.

అలాంటి వారితో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో అని అవగతమౌతుంది. దైవం మనకేది ప్రసాదించాడో దాన్నే మహాప్రసాదం మనుగడ సాగించే వాడే నిజమైన ధనవంతుడు. దేవ్ఞని ప్రేమాభిమానాలు పొందడం కంటే మించిన ధనం ఏముంటుంది? ప్రవక్త మహనీయులు ‘మీకంటెతి అధికమైన ధనవంతుల వైపు చూడకండి. మీకంటె బీదల వైపు చూడండి అన్నారు. నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనకంటె పైవారిని, ప్రాపంచిక విషయాల్లో మనకంటె కిందస్థాయి వాళ్లను చూడాలని అన్నారు.

– షేఖ్‌ అబ్దుల్‌హఖ్‌