తక్కువ ధరకు ఇసుక పంపిణీ ప్రభుత్వ లక్ష్యం

ఎపి మంత్రి యనమల రామకృష్ణుడు
విశాఖపట్నం : నిర్మాణ రంగానికి, సామాన్యులకు తక్కువ ధరకే ఇసుక అంధించాలనే లక్ష్యంతో నూతన విధానాన్ని రూపొందించామని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మంత్రి యనమల అధ్యక్షతన ఇసుక విధానంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఆదివారం విశాఖ కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశమైంది. సమావేశ వివరాలను యనమల మీడియాకు వివరించారు. అవకతవకలకు, అక్రమాలను తావ్ఞలేని విధంగా రాష్ట్రంలో 1.5కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు వేలం పాటలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఒక్కొక్క క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు వేలం నిర్వహించనున్నామన్నారు. దీనికి 550 రూపాయల గరిష్ట ధరగా నిర్ణయించామన్నారు. రవాణా చార్జీలు దీనికి అదనం అన్నారు. వేలం దక్కించుకున్న వారు ఎవరైనా ఇసుక తవ్వకాల్లో అవకతవకలకు, అక్రమాలకు పాల్పడితే వారికి ఇచ్చిన అనుమతులు తక్షణం రద్దయ్యేలా నిబంధనలు రూపొందిస్తున్నామన్నారు.