ఢిల్లీ మాజీ సీఎం మదన్‌లాల్‌ ఖురానా కన్నుమూత

MADAN LAL KHURANA
MADAN LAL KHURANA

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి బిజెపి నాయకుడుమదన్‌లాల్‌ఖురానా పరమపదించారు. దీర్ఘకాలంగా అస్వస్థతలో ఉన్న ఖురానా శనివారం కన్నుమూసారని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. 82 ఏళ్ల ఖురానాకు భార్య కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. శనివారంరాత్రి 11 గంటలప్రాంతంలో కీర్తినగర్‌లోని ఆయన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఖురానాకు దీర్ఘకాలంగా ఛాతిలో ఇన్ఫెక్షన్‌, జ్వరంతో బాధపడుతున్నారు. గడచిన కొన్నిరోజులుగా శ్వాసపీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఐదేళ్లుగా ఆయన బ్రెయిన్‌ హెమరేజితో కూడా బాధపడుతున్నారు. బిజెపి వృద్ధనేతగా పేరున్న ఖురానా 1993నుంచి 1996వరకూ ఢిల్లీలో ముఖ్యమంత్రిగాపనిచేసారు. ఆయన్ను అప్పట్లో ఢిల్లీ సింహంగా నేతలు పిలిచేవారు. ఢిల్లీలో బిజెపి పటిష్టతకు ఎంతో కృషిచేసారు. 1991లో జరిగిన 69వ రాజ్యాంగ సవరణ చట్టంప్రకారం ఆయన 69వ ఢిల్లీ శాసనసభకు ప్రతినిధిగా పనిచేసారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాలుగుపర్యాయాలుఎంపిగాను, రాజస్థాన్‌ గవర్నర్‌గాను పనిచేసారు. అలాగే వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన పార్లమెంటరీ వ్యవహారాలు, పర్యాటక మంత్రిగా కూడా పనిచేసారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పించాలని సంపూర్ణమద్దతునిచ్చారు. నిష్కర్షగా విమర్శలుచేసే ఖురానా కేంద్ర రాస్ట్రాలతో సంబంధాలు నెరపేవారు. ప్రధాని నరేంద్రమోడీ ఖురానా మృతిపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఢిల్లీ ప్రగతికి విరామమెరుగని నేతగాపనిచేసారని ఆయన సేవలు గుర్తుచేసుకున్నారు. బిజెపి చీఫ్‌ అమిత్‌షా కూడా ఖురానా మృతిపట్ల సంతాపం ప్రకటించారు. విద్యార్ధిపరిషత్‌లోను, స్వయంసేవక్‌గాను విరామమెరుగని నేతగా నిలిచారని షా పేర్కొన్నారు. ఢిల్లీప్రభుత్వం మదన్‌లాల్‌ మృతికిసంతాపసూచకంగా రెండురోజులు సంతాపదినాలుప్రకటించింది.