ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కెసిఆర్‌

KCR
KCR

నవంబర్‌ మొదటి వారంలో 3 జిల్లాల్లో కెసిఆర్‌ సభలు
హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. కంటి, పంటి పరీక్షల కోసం సిఎం కెసిఆర్‌ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. సోమవారంనాడు కంటి,పంటి పరీక్షలు చేయించుకున్నాక, ఢిల్లీలో కొందరు కేంద్ర పెద్దలను కలిసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఆయన సాయంత్రమే తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు. రాబోయే రోజుల్లో సిఎం కెసిఆర్‌ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించినట్లు సిఎంఓ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన సిఎం కెసిఆర్‌ నవంబర్‌ మొదటి వారంలో ఖమ్మం,వరంగల్‌,కరీంనగర్‌ జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలైనట్లు సమాచారం. ఇప్పటికే కెసిఆర్‌ మూడు జిల్లాలు నిజామాబాద్‌,వనపర్తి,నల్లగొండలో సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నారు. నవంబర్‌ మొదటి వారంలోనే ఈ మూడు సభలు జరుగనున్నాయి. నవంబర్‌ 19 తర్వాత పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కెసిఆర్‌ సుడిగాలి పర్యటన చేస్తారు.