ఢిల్లీ కోర్టులో న్యాయ‌వాదినిపై అత్యాచారం

Raped  woman advocate
Raped woman advocate

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టు కాంప్లెక్స్‌లో తన చాంబర్లో మహిళా న్యాయవాదిని అత్యాచారం చేసిన సీనియర్ న్యాయవాది(50ఏళ్లు)ని ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో అరెస్ట్ చేశామని, తరువాత సాకేత్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ(సౌత్) రోమిల్ బానియా వెల్లడించారు. బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. నిందితుడు, బాధితురాలు ఇద్దరు కోర్టు భవనంలోని ఒకే కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నారు. తాగిన మైకంలో నిందితుడు మహిళా న్యాయవాదిని తన చాంబర్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులకు ఫోన్ చేసి బాధితురాలు సమాచారం తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేశామని, వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి కూడా తరలించినట్లు వారు వెల్లడించారు. లైంగిక దాడి జరిగిన చాంబర్‌ను సీజ్ చేశాం. ఫోరెన్సిక్, క్రైమ్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించాయని డీసీపీ వివరించారు.