డబ్బు ఇవ్వలేదని చికిత్స చేయని డాక్టర్

లక్నో : వైద్యో నారాయణ హరిః అంటారు. కానీ ఆ వైద్యుడికి ఇవేమీ పట్టలేదు. లంచం ఇవ్వలేదన్న నెపంతో సరైన సమయంలో చికిత్స అందివ్వకపోవడంతో వినోద్ అనే బాలుడు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యుపిలోని పంచనేహి గ్రామానికి చెందిన పుష్పరాజ్ సింగ్ యాదవ్ తన మేనల్లుడికి జ్వరం రావడంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న వైద్యుడు ఐదువేల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో డాక్టర్ వేరొక ఆసుపత్రికి తీసుకెళ్ళమని తెలుపగా, యాదవ్ తన మేనల్లుడిని తీసుకొని జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడకు వెళ్లిన కొద్ది సేపటికి వినోద్ మృతి చెందాడు. దీంతో మేనల్లుడి మృతదేహాన్ని తీసుకొని జిల్లా మేజిస్ట్రేట్ వద్దకు యాదవ్ వెళ్లి వైద్యుడి నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో వారి గ్రామానికి తీసుకొని వెళ్లారు. దీనిపై డిఎం మాట్లాడుతూ బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి వైద్యునిపై ఫిర్యాదు చేశారని, ఈ కేసులో తదుపరి చర్యలపై విచారణ చేపట్టడానికి జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ తివారీ, డిప్యూటీ జిల్లా మేజిస్ట్రేట్ ఎంపి పాల్ ఇద్దరు సభ్యుల బృందాన్ని నియమించినట్లు తెలిపారు.