డిసెంబరు 15లోగా ఏపిలో హైకోర్టు

supreem court
supreem court

ఏపిలో తాత్కాలిక భవన నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజన
కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
డిసెంబర్‌ 15లోగా హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందన్న ఏపీ
హైదరాబాద్‌: వీలైనంత త్వరగా ఉమ్మడి హైకోర్టును విభజించి,ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తే మంచిదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏకె సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.ఉమ్మడి హైకోర్టు విభజనపై సోమవారంనాడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబర్‌ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైందని ఆంధ్రప్రదేశ్‌ తరఫు న్యాయవాది పాలీ నారీమన్‌ వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు భవనాలు నిర్మాణం పూర్తయ్యే వరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా రెండు రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ కోర్టుకు సమర్పించింది. హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణం డిసెంబర్‌ 15లోగా పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత నోటిఫికేషన్‌ విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నారీ మన్‌ ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అదీగాక మార్చి,ఏప్రిల్‌ నాటికి న్యాయాధికారులకు క్వార్టర్స్‌, జడ్జీల నివాసాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ ఏపీ ప్రభుత్వం అంత స్పష్టంగా చెబుతున్నందున భవన నిర్మాణాలకు సంబంధించి ఫోటోలను న్యాయస్థానానికి అందజేయాలని కోరారు. ఈ సమయంలో తెలంగాణ తరఫున న్యాయవాది ముఖుల్‌రోస్ని కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ హైకోర్టు విభజన జరగక పోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, వీలైనంత త్వరగా హైకోర్టు విభజన జరిగేలా చూడాలని కోరారు.