డిజిటలైజేషన్‌తో 39 బిలియన్‌ డాలర్ల ఎగుమతి వాణిజ్యం

E-COMMERCE
E-COMMERCE

న్యూఢిల్లీ: డిజిటైజేషన్‌ శరవేగంగా వృద్ధిచెందుతుండటంతో ఆన్‌లైన్‌ ఆర్డర్లతో ఎగుమతి వ్యాపారం మరింతగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు జోరందుకుంటున్నాయి. అమెరికా,యుకె వంటి దేశాలు ఈ తరహా ఎగుమతులకు ఎక్కువ అవకాశం ఉందని భారత వాణిజ్యమంత్రిత్వశాఖ భావిస్తోంది. 2022 నాటికి 39 బిలియన్‌ డాలర్లమేర ఎగుమతి మార్కెట్‌ పెంచుతుందని అంచనావేసింది. అంతేకాకుండా గూగుల్‌కెపిఎంజి వంటి సంస్థలు నిర్వహించిన సర్వేలో సైతం డిజిటైజేషన్‌ వల్ల ఎగుమతుల భారీగా వృద్ధిచెందే అవకాశం ఉందని అంచనావేస్తున్నాయి. పర్యాటక రంగం, మీడియా, వినోదరంగం, సాఫ్ట్‌వేర్‌ సేవల రంగం (సాస్‌) వినియోగరంగ బ్రాండ్లు, రియాల్టీ వంటివి కీలక రంగాలుగా మార్కెట్‌ సౌలభ్యత ఉన్న రంగాలుగా సర్వేలో తేలింది.ఈ రంగాలకు అంతర్జాతీయ అవకాశాలు సైతం ఎక్కువ ఉన్నట్లు అంచనా. అంతేకాకుండా విదేశీ కొనుగోలుదారులుసైతం డిజిటైజేషన్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని భారత్‌లో కొనుగోళ్లకు ఉపక్రమించే అవకాశం ఉందని అంచనా. ఆసియా పసిఫిక్‌ప్రాంతం ఈ మార్కెట్లకు ఎక్కువ కీలకంగా కనిపిస్తోంది. భారతీయ కంపెనీలు, చైనా, మలేసియా, ఇండోనేసియా వంటివి కీలక లక్ష్యనిర్దేశిత దేశాలుగా నిలిచాయి. డిజిటల్‌స్థాయిలో భారీగా వృద్ధిచెందిన దేశాల్లో ముందు అమెరికా, బ్రిటన్‌ దేశాలు కనిపిస్తాయి. వీటికిసైతం డిజిటల్‌ ఛానెళ్ల ద్వారా ఎగు మతులను వృద్ధి చేసుకోగలమని భారత్‌ ఇకామర్స్‌ సంస్థలు అంచనావేస్తున్నాయి. భారత్‌ ఉత్పత్తులకు అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా చేసుకుని వాణిజ్యసంస్థలు ఎక్కువ డిజిటైజేషన్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. వర్ధమాన దేశాల్లో ఈ తరహా ధోరణి ఇటీవల మరింత పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల రాకతో డిజిటైజేషన్‌కు మరింతప్రాధాన్యతపెరిగింది. సరిహద్దు వాణిజ్యం అంటే దేశవిదేశాల మధ్య మొబైల్‌ ఇ-కామర్స్‌ భారీగా వృద్ధి చెందినట్లు గూగుల్‌ ఇండియా డైరెక్టర్‌ మార్కెటింగ్‌ షాలినీ గిరీష్‌ వెల్లడించారు. కెపిఎంజి భాగస్వామి శ్రీధర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్ర ప్రపంచ వాణిజ్య మార్కెట్‌లో క్రమేపీ వృద్ధి చెందుతోందని అన్నారు. ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా 41శాతంగా ఉంది. వాణిజ్యసేవలపరంగా ఈ దేశాల వాటా 36శాతంగా నిలిచింది. భారత్‌ తూర్పువైపు చూపు అన్న విధానం డిజిటైజేషన్‌ ఎగుమతులకు భారీ అవకాశాలిస్తుందని అంచనా. ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లో చైనా, మలేసియా, ఇండోనేసియా వంటివి ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పర్యాటకరంగంపరంగా వార్షికవృద్ధి 18శాతం పెరిగి 3.1బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. 2022 నాటికి 12.8 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు రాగలరని అంచనా. ఇక మీడియా వినోదరంగాల పరంగాచూస్తే వార్షికవృద్ధి 37శాతంగా ఉంది. 2022 నాటికి 3.46 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. అలాగే రియల్‌ ఎస్టేట్‌ విభాగం 11.5 బిలియన్‌ డాలర్ల నుంచి 25.7 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని 17శాతం వార్షిక వృద్ధినమోదవుతుందని అంచనావేసింది. భారతీయ రియాల్టర్లు ఎన్‌ఆర్‌ఐ హెచ్‌ఎన్‌ఐ కస్టమర్‌బేస్‌ పెంచుకోవాలనిచూస్తున్నారు. టెక్నాలజీ, డిజిటల్‌ ప్లాట్‌ఫారాలపరంగా మరింత వృద్ధిని సాధిస్తుందని అంచనావేసింది.