ఠాగూర్‌ కుర్చీలో నేనే కూర్చోలేదు..అమిత్‌ షా

సాక్ష్యాలను సభ ముందు ఉంచిన అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇటీవల విశ్వభారతీ యూనివర్శిటీని సందర్శించిన వేళ, రవీంద్ర నాథ్ ఠాగూర్ వాడిన కుర్చీలో కూర్చున్నానంటూ వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఠాగూర్ కు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, ఆయన వాడిన కుర్చీలో కూర్చున్నారని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి ఆరోపించిన నేపథ్యంలో, అమిత్ షా స్పందించారు. తాను పర్యాటకులకు కేటాయించిన కుర్చీలోనే కూర్చున్నానని స్పష్టం చేస్తూ, అందుకు సంబంధించిన సాక్ష్యాలను లోక్ సభ ముందు ఉంచేందుకు స్పీకర్ అనుమతి కోరారు.

గతంలో ప్రణబ్ ముఖర్జీ, రాజీవ్ గాంధీ తదితరులు కూర్చున్న విండో సీట్ లోనే తానూ కూర్చున్నానని, విశ్వ భారతి విశ్వవిద్యాలయం సందర్శకులందరికీ అక్కడ కూర్చునే అవకాశం ఉంటుందని అన్నారు. తాను కూర్చున్న ప్లేస్ ఏదో చెప్పాలని వైస్ చాన్స్ లర్ ను రిపోర్ట్ కోరానని, ఆ సమయంలో తీసిన చిత్రాలు, వీడియోను వీక్షించి ఎక్కడ కూర్చున్నానన్న విషయాన్ని సభే తేల్చాలని సూచించారు.

ఏవైనా ఆరోపణలు చేసే సమయంలో నిజానిజాలను తెలుసుకోవాలని చెప్పిన అమిత్ షా, ఠాగూర్ కూర్చునే కుర్చీలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూర్చున్న చిత్రాన్ని ఆయన సభలో చూపించడం గమనార్హం. అంతకుముందు అధీర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ, ఠాగూర్ కు అమిత్ షా ఏ మాత్రమూ గౌరవం ఇవ్వలేదని, ఆయన కూర్చున్న కుర్చీని ఇప్పుడు ఎంతో పవిత్రంగా చూసుకుంటుండగా, అమిత్ షా దానిలోనే కూర్చున్నారని ఆరోపించడంతో అధికార పక్షం అడ్డుకుంది. దీంతో పెను దుమారమే చెలరేగగా, తాజాగా అమిత్ షా వివరణ ఇచ్చారు.