ట్రిపుల్‌ తలాక్‌పై కొరవడిన ఏకాభిప్రాయం

Triple Talaq
Triple Talaq

న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోప్రవేశపెట్టి చర్చించడాన్ని అధికారపార్టీ వాయిదా వేసింది. ఈ బిల్లుపై అన్ని రాజకీయ పార్టీలనుంచి ఏకాభిప్రాయం రాలేనందున బిల్లును వర్షాకాల సమావేశాల్లోప్రవేశపెట్టడం సముచితం కాదని అధికార పక్షం భావించింది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు ముస్లిం మహిళల వివాహహక్కుల పరిరక్షణ బిల్లు 2017ను స్థాయి సంఘానికి నివేదించాలని పట్టుబట్టింది. బిల్లును సమగ్రంగా పరిశీలించాలని కోరింది. బిజెపి ఆధంవర్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఎగువసభలో మెజార్టీ లేకపోవడంతో ఈ బిల్లును బడ్జెట్‌ సమావేశాల్లో కూడా క్లియర్‌చేయలేకపోయింది. రెండుసార్లు వాయిదాపడిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి సమావేశం అయిన సభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కొన్ని బిల్లులపై విశాలధృక్పథంతో కూడిన ఏకాభిప్రాయం అవసరమని, సమగ్ర చర్చలు కూడా జరగాల్సిన అవసరం ఉందని అందువల్ల తర్వాత వీటిని చర్చకు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా త్రిపుల్‌ తలాక్‌ బిల్లును మాత్రం ఈ రోజు చర్చలకు చేపట్టడంలేదని, ఈ బిల్లుపై ఏకాభిప్రాయం రాలేదని వెంకయ్య పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌ముందురోజే బిల్లులోసవరణలను ఆమోదించింది. గత ఏడాది ఆగస్టు 22 వ తేదీ సుప్రీంకోర్టు త్రిపుల్‌ తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెపుతూ ఉత్తర్వులు జారీచేయడంతో బిల్లును హక్కులపరిరక్షణ బిల్లుపేరిట ముసాయిదాను రూపొందించింది. గత ఏడాది డిసెంబరులోనే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. తాజాగా బిల్లులో మేజిస్ట్రేట్‌ తలాక్‌ చెప్పిన భర్తకు బెయిల్‌ ఇచ్చే అధికారాన్ని కూడా చేర్చారు. అయితే భార్యకు భరణం ఇచ్చేందుకు అంగీకరించిన పక్షంలో మాత్రమే బెయిల్‌ మంజూరుచేస్తారు. అయితే ఈ బిల్లులో చేపట్టిన సవరణలను రాజ్యసభ ఆమోదించినపక్షంలో తిరిగి మరోసారి లోక్‌సభ ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంటు సమావేశాల చివరిరోజు రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. విరామసమయానికి ముందే రెండుసార్లు వాయిదా పడింది. రాఫెల్‌ జెట్‌ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుజరిపించాలని ప్రధాన ప్రతిపక్షం పట్టుబట్టడమే ఇందుకు ప్రధాన కారణం.