ట్రాఫిక్‌ పోలీసు అధికారులకు రోడ్డు భద్రతపై శిక్షణ

TRAINING
TRAINING

హైదరాబాద్‌: రోడ్డు భద్రత, రోడ్లపై వున్న ప్రమాదకర గోతులను గుర్తించి వాటిని సరిచేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు చెందిన ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లకు బుధవారం నాడు డిజిపి కార్యాలయంలో ఒక రోజు శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా శాంతి భద్రతల చీఫ్‌ జితేందర్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ పోలీసులు కేవలం వాహనాల రాకపోకలను నియంత్రించడం వరకు, ట్రాఫిక్‌ సమస్యలను తీర్చడం వరకే పరిమితమవకూడదని, రోడ్డు భద్రతపై దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా రోడ్లపై ప్రమాదాలకు ఆస్కారం వున్న గోతులను గుర్తించి వాటిని ఇతర సర్కారీ విభాగాల చేత బాగు చేయించాలని ఆయన కోరారు. రోడ్లు సవ్యంగా వుంటే ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. వాహనదారులకు ఇది మరింత సౌకర్యంగా వుంటుందని ఆయన చెప్పారు. ట్రాఫిక్‌ పోలీసులు తమ విధులతో పాటు రోడ్డు భద్రతకు, రహదారులు సవ్యంగా వుండేలా చేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు.