ట్రంప్‌పై సెక్స్ స్కాండ‌ల్ అభియోగాలు

Donald trump
Donald trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సాగుతున్న విచారణలో భాగంగా ట్రంప్‌ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ , ప్రచార మాజీ మేనేజర్‌ పాల్‌ మనాఫోర్ట్‌ లు కోర్టుల్లో దోషులుగా తేలడం ఒక్కసారిగా ట్రంప్‌ను చిక్కుల్లోకి నెట్టేసింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన  సెక్స్‌ స్కాండల్‌  ముడుపుల వ్యవహారం ఇప్పుడు వెలుగుచూడడంతో ట్రంప్‌ ఎన్నడూ లేనివిధంగా విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ పన్నుల ఎగవేత, బ్యాంకుల్ని మోసగించడం, ప్రచార ఆర్థిక చట్టాల ఉల్లంఘన నేరాలను కోర్టు ఎదుట అంగీకరించడం ట్రంప్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది.అంతేకాదు ట్రంప్‌తో తమకు లైంగిక సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న ప్లేబాయ్‌ మోడల్‌ కరెన్‌ మెక్‌ డౌగల్, పార్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్‌లు నోరు మూయించడానికి మూడో కంటికి తెలీకుండా ముడుపులు చెల్లించాలని  ట్రంప్‌ తనకు చెప్పారంటూ కోహెన్‌ కోర్టుకు వెల్లడించారు. ఇవన్నీ ఇప్పుడు ట్రంప్‌ను గద్దె దింపుతారా అన్న చర్చకు దారి తీశాయి.  ట్రంప్‌ సైతం తనను అభిశంసిస్తే మార్కెట్లు కుప్పకూలి అందరూ పేదవాళ్లయిపోతారని బెదిరించారంటే ఆయన కూడా ఆందోళనలో ఉన్నట్టు అర్థమవుతోంది.