టెెలికాం రంగంలో సంక్షోభం లేదా?

manoj sinha ,telecom minister
manoj sinha ,telecom minister

మనోజ్‌ సిన్హా మాటల్లో నిజమెంత!
న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ఉద్యోగాలకు ఎలాంటి సమస్యలేదని కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా అంటున్నారంటే వేలాది మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లటానికి సిద్ధమవుతున్నారనే విషయం భహుషా ఆయనకు తెలియదనే అనుకోవాలి. గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతూనే ఉంది. సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడం, అలాగే ఈ రంగంలో చోటుచేసుకుంటున్న కన్సాలిడేషన్‌ ఉద్యోగాలకు పెనుముప్పుగా మారింది. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లాంటి సంస్థలు తమ దుకాణాన్నిమూసేసినప్పుడు నష్టపోయే ఉద్యోగాల గురించి బుధవారం విలేకరులు మంత్రిని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన ‘ఉద్యోగాలకు ఎలాంటి సమస్యలేదు. జియో ఎన్ని దుకాణాలను తెరిచిందో చూడండి.ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని చెప్పడం వాస్తవ విరుద్ధం అని అన్నారు. అంతేకాకుండా శరవేగంగా జరుగుతున్న కన్సాలిడేషన్‌ కారణంగా ఈ రంగంలో స్థిరీకరణ చోటు చేసుకుంటుందని రిలయన్స్‌ జియో రాకతో వాస్తవానికి మరిన్ని ఉద్యోగాలు వచ్చాయని ఆయన వాధించారు. అయితే టెలికాం రంగానికి సంబంధించి సిన్హా ఆశాహదృక్పథం దీర్ఘకాలికంగా చూసినట్లయితే నిజమేకావచ్చు కాని, ప్రస్తుతానికైతే వేలాది మంది ఉద్యోగులు భయంతో జీవిస్తున్నారు.
భయంకాదు…వాస్తవమే
మరో నెలరోజుల తర్వాత రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కాం)కు చెందిన చాలా మంది ఉద్యోగులు మరో ఉద్యోగాన్ని వెతుక్కోవలసి ఉంటుంది. ఈ సంస్థ తన వైర్‌లెస్‌ వ్యాపారాల్లో చాలా వాటిని మూసివేయనుంది. అలాగే టాటాగ్రూప్‌ తన మొబైల్‌ వ్యాపారాన్ని భారతీఎయిర్‌టెల్‌కు విక్రయిస్తోంది. దీనికారణంగా కూడా కొన్ని ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదం ఉంది. గత ఏడాది దేశంలో టెలికాం రంగం 10వేల ఉద్యోగాల కోత విధించిందని, ఇప్పుడు కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా ఈ ఏడాది 30-40వేల మంది ఉద్యోగాల్లో కోతపడే అవకాశముందని, గత జూన్‌లో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ చైర్మన్‌ అనీల్‌ అంబానీ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ వాణిజ్య పత్రిక, పలువురు విశ్లేషకులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు, రిక్రూట్‌ సంస్థలతో మాట్లాడినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ టెలికాం కంపెనీలు తమ ఉద్యోగాల గురించి భయపడుతున్నట్లు వారంతా చెప్పారు. 10నుండి 25దాకా ఉద్యోగాలు రిస్కులో ఉన్నట్లు ఓ కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగం అధిపతి చెప్పారు. ఇక పరోక్షంగా ఉద్యోగాలు తీసుకున్న వారి సంఖ్యను కూడా లెక్కలోని తీసుకున్నట్లయితే ఈ సంఖ్య లక్షదాకా ఉండవచ్చు.