టెలికాం రంగానికి కేబినెట్‌ ప్యాకేజీ

TELECOM
TELECOM

న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న టెలికాం రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర కేబినెట్‌ ముందుకొచ్చింది. టెలికాం రంగానికి ఊరటనిచ్చేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా స్పెక్ట్రమ్‌ చెల్లింపుల గడువు పొడిగించనున్నట్లు సమాచారం. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగాన్ని పునరుద్ధరించాలని అంతర్గత మంత్రిత్వశాఖల బృందం (ఐఎంజి) ఇటీవల కేబినెట్‌కు సిఫార్సు చేసింది. దీంతో బుధవారం జరగబోయే కేబినేట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో సెక్ట్రమ్‌ చెల్లింపుల గడువును పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేలం ద్వారా స్పెక్ట్రమ్‌లను కొనుగోలు చేసిన టెలికాం ఆపరేటర్లు ఆ మొత్తాన్ని 10 ఏళ్లలోగా చెల్లించాలి. ఈ గడువును 16 ఏళ్లకు పెంచాలని ఐఎంజీ కేబినేట్‌కు సిఫార్సు చేసింది. కాగా ఈ సిఫార్సుతో టెలికాం శాఖ కూడా ఏకీభవించినట్లు సమాచారం. నేడు జరగబోయే సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది.