కెసిఆర్ చేతుల మీదుగా టెక్స్‌టైల్ పార్క్‌కు శంఖుస్థాప‌న‌

kcr
kcr

హైదరాబాద్‌: వ‌స్త్ర రంగంలో నూలు పోగు నుండి దుస్తుల‌ తయారీ వరకు అధునాతన వసతులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కంపెనీల పెట్టుబడుల ద్వారా మొత్తం 66 వేల మందికి దీనిద్వారా ఉపాధి లభిస్తుందని వివరించారు. దేశంలోనే అతిపెద్దదైన ఈ పార్కుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం శంఖుస్థాపన చేస్తారని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. ‘వరంగల్‌ గ్రామీణ జిల్లా శాయంపేట, చింతపల్లి గ్రామాల పరిధిలో రెండు వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. మొదటి దశలో 1200 ఎకరాల్లో పరిశ్రమలు విస్తరించనున్నాయి. రాష్ట్రంలో నాణ్యమైన పత్తి దిగుబడి అయ్యే ప్రాంతాలకు చేరువగా ఈ పార్కు ఉండేలా చర్యలు తీసుకున్నాం. దుస్తుల తయారీకి అవసరమైన షెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. టెస్టింగ్‌ ల్యాబోరేటరీతోపాటు ఉద్గారాలు లేని విధానాన్ని ఇక్కడ అమలు చేస్తుండడంతో కాలుష్య సమస్య పెద్దగా ఉండదు. భవిష్యత్తులో బాహ్యవలయ రహదారితోపాటు విమానాలు దిగేందుకు వసతి(ఎయిర్‌స్ట్రిప్‌)ని అందుబాటులోకి తెస్తాం. పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే 12 కంపెనీలు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన యాంగ్వాన్‌ కంపెనీ సుమారు రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దుస్తుల పరిశ్రమల స్థాపన మంచి ముందడుగు అవుతుంది. టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలో తెలంగాణకు ఉన్న సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునిక సాంకేతిక సొబగులు అద్దడం ద్వారా మరింతగా ఉపాధి అవకాశాలను పెంచినట్లు అవుతుంది. ఈ పార్కుకు అనుబంధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో ఎనిమిది కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ స్ఫూర్తిని ప్రతిబింబించేలా పార్కు లోగో, పైలాన్లను టీఎస్‌ఐఐసీ రూపొందించింది’ అని కేటీఆర్‌ చెప్పారు. సమీక్షలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.