టెక్నాలజీయే ప్రాణం

KTR
KTR

ఐటీ పాలసీలో 10 రంగాలపై దృష్టి సారించాం
పారిశ్రామిక ప్రగతిలో డిజిటల్‌ విప్లవమే కీలకం
బ్లాక్‌చైన్‌ సదస్సులో కేటీఆర్‌
హైదరాబాద్‌: టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మున్సిపల్‌, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, అది ప్రజలకు ఉపయోగపడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఐటీ ఆధారిత సేవలను రోజురోజుకూ బలపరుస్తూనే ఉన్నామనీ, ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనాలసిస్‌ వంటి సాంకేతిక విప్లవాలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఐటీ పాలసీని ప్రారంభించిందనీ, దాని ప్రకారం 10 రంగాలనీ దృష్టి సారించామని పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన అంతర్జాతీయ బ్లాక్‌ చైన్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పారిశ్రామిక ప్రగతిలో డిజిటల్‌ విప్లవం కూడా కీలకంగా మారిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించడంలో బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతోందన్నారు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ అమలులో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మానవాభివృద్ధిలో ఇదో కొత్త అధ్యాయం అని గుర్తు చేశారు. వివిధ శాఖలను ఈ టెక్నాలజీ సమన్వయం చేస్తుందన్నారు. మానవాభివృద్ధిలో ఇదో కొత్త అధ్యాయమనీ, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఏ రంగంలోనైనా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. దీని వల్ల నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుందని చెప్పారు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో విశ్వసనీయత, కచ్చితత్వం పెరుగుతుందన్నారు. ఈ టెక్నాలజీతో మోసాలను అరికట్టవచ్చనీ, ఆర్థిక లావాదేవీలపై బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ పూర్తి నియంత్రణ కలిగి ఉంటుందన్నారు. ప్రజలకు చెందిన భూ రికార్డులు, ఓటింగ్‌ రికార్డులు, ఆరోగ్యపరమైన రికార్డులు ఇలా అన్నీ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ద్వారా సురక్షితంగా ఉంటాయన్నారు. భూ రికార్డుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత క్లిష్టమైన సమస్య అనీ, కానీ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో ఆ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. భూమికి సంబంధించిన పత్రాలు ఎవరికి అమ్మారు ? ఎవరు కొన్నారనే అంశాలు ఈ టెక్నాలజీతో భద్రంగా ఉంటాయన్నారు. భవిష్యత్తులో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ టెక్నాలజీ అత్యంత ఆధునికమైనదనీ, సమగ్రమైందనీ, పారదర్శకమైందని పేర్కొన్నారు. పౌరులు వివిధ దశల్లో వాడే కీలకమైన డాక్యుమెంట్లను ఈ టెక్నాలజీతో భద్రపరచుకోవచ్చని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన ఇప్పటికే దాదాపు 93 శాతం విజయవంతం అయిందని గుర్తు చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనను ఇప్పుడు ఈ టెక్నాలజీని వినియోగించి పట్టణ ప్రాంతాలలోనూ చేపట్టనున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారంగా కొన్ని పైలట్‌ ప్రాజెక్టులను చేపడుతుందని కెటిఆర్‌ తెలిపారు. 10వ తరగతి సర్టిఫికెట్లను భద్రపరిచేందుకు ఈ పరిజ్ఞానాన్ని వాడుతున్నట్లు చెప్పారు. విద్యార్థుల టెన్త్‌ డేటాను బ్లాక చైన్‌ టెక్నాలజీ ద్వారా స్టోర్‌ చేస్తామనీ, విద్యార్థులు డేటాను ఎవరైనా, ఎప్పుడైనా వెరిఫై చేసుకునే సదుపాయం ఈ టెక్నాలజీతో
ఉందని వివరించారు.