టీ 20కు స్మిత్ దూరం

SMITH
SMITH

రాంచీ: భారత్‌తో టీ20 సిరీస్‌ ప్రారంభానికి ముందే ఆసీస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సారథి స్టీవ్‌ స్మిత్ భుజానికి గాయం ఐన కారణంగా స్వదేశానికి పయనమయ్యాడు. టీ20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఈ రోజు సాయంత్రం తొలి మ్యాచ్‌ రాంచీలో ప్రారంభంకానుంది. వన్డే సిరీస్‌ అనంతరం తొలి టీ20 కోసం రాంచీ చేరుకున్న స్మిత్‌ సేన గురువారం సాధనలో పాల్గొంది. ఈ క్రమంలో స్మిత్‌ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన జట్టు మేనేజ్‌మెంట్‌ స్మిత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి ఎమ్మారై స్కానింగ్‌ తీయించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మ్యాచుకు అందుబాటులో ఉండొచ్చని వైద్యులు తెలిపారు. కానీ, ఆసీస్‌ బోర్డు స్మిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఎందుకంటే త్వరలో ఇంగ్లాండ్‌తో ఆ జట్టు ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ ఆడనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే స్మిత్‌ను స్వదేశానికి పంపించివేసినట్లు తెలుస్తోంది. స్మిత్‌ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారో బోర్డు నిర్వాహకులు ఇంకా వెల్లడించలేదు. సారథ్య బాధ్యతలను డేవిడ్‌ వార్నర్‌ అందుకునే అవకాశం ఉంది.