టీడీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డ రేవంత్‌రెడ్డి

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్: ఇటీవ‌లే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి టీటీపీ నేత‌ల‌పై విరుచుకుపడ్డారు. టీటీడీపీ నేత ఎల్ రమణను రేవంత్ కూలీ మనిషితో పోల్చుతూ, రమణ ఉపాధి హామీ కూలీల మాదిరిగా.. టీఆర్‌ఎస్‌ నేతల దగ్గర డబ్బు తీసుకొని సైలెంట్ అయ్యారని ఆరోపించారు. తన యుద్ధం కూలీలపై కాదు…కేసీఆర్‌పైనే అని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గతంలో పలువురు ఏపీ మంత్రుల తీరును రేవంత్ తీవ్రంగా తప్పుపట్టారు. అసలు తెలంగాణలో ఏపీ మంత్రులకు పనేంటి? అని నిలదీశారు. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ రూ. 2 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని అన్నారు. ఇలా కాంట్రాక్టు తీసుకున్న యనమల.. కేసీఆర్ మీద ఈగ నైనా వాలనిస్తారా? అని వ్యాఖ్యానించారు.‘నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్‌కు ఏపీ నేతలు దండం పెడతారా? ఏపీ నేతలు అన్నం పెట్టిన వాళ్లకే సున్నం పెడుతున్నారు. అసలు కేసీఆర్‌కు ఏపీ నేతలు అంతగా మర్యాద చెయ్యాల్సిన అవసరమేంటి? పరిటాల శ్రీరాం పెళ్లిలో కేసీఆర్‌కు వంగి వంగి దండాలు పెట్టారు. అంత సీన్ చేయడం అవసరమా? అదే చంద్రబాబు ఇక్కడికి వస్తే.. కనీసం పట్టించుకునే వాళ్లు లేరు. హైదరాబాద్‌లో పరిటాల శ్రీరాం, పయ్యావుల అల్లుడి భాగస్వామ్యంతో బీర్ల తయారీ కంపెనీకి లైసెన్స్ ఎలా వచ్చింది?’ అంటూ ఏపీ నేతలపై రేవంత్ రెడ్డి నిప్పులు చేరిగారు.