టీటీడీ వివాదంపై సుప్రీం కోర్టుకు బీజేపీ నేత

SUBRAMANYA SWAMI
SUBRAMANYA SWAMI

హైదరాబాద్‌: టీటీడీ పాలక మండలిలో గత కొంత కాలంగా సాగుతున్న వివాదాలు సుప్రీం కోర్టుకు చేరనున్నాయి. తిరుమల ఆలయం ప్రధాన అర్చకునిగా కొనసాగుతున్న రమణ దీక్షితులను పాలక మండలి ఆ పదవి నుంచి తొలగించడం వివాదాస్పదమైంది. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని వివాదాలు వీడటం లేదు. బోర్డులో జరుగుతున్న వివాదంపై టీటీడీ ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపగా, భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే, హిందూ మతానికి చెందని టీడీపీ ఎమ్మెల్యే అనితను టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమించారు. అలాగే, మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి సతీమణికి సైతం పాలక మండలిలో చోటు కల్పించారు. ఈ క్రమంలో టీటీడీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నిర్ణయించారు. ఈనెల 19న సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీని తొలగించాలన్నదే స్వామి పిటిషన్‌ సారాంశమని సమాచారం. ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించాలనీ, దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలనీ, లేదంటే లూటీ ఇలాగాఏ కొనసాగుతుందని గతంలో స్వామి వ్యాఖ్యానించారు.