టీఆర్‌ఎస్‌కు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుడ్‌బై

konda visweswarareddy
konda visweswarareddy

చేవెళ్ళ పార్లమెంట్‌లో కారు జోరుకు బ్రేకులు
టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో గుబులు
మారనున్న రాజకీయ సమీకరణాలు
హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించడంతో రంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు తలగిందులుగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేవీ రంగారెడ్డి మనువడు ప్రముఖ ఆర్థికవేత్త, అపోలో చైర్మెన్‌ అల్లుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అనుహ్యంగా టీఆర్‌ఎస్‌ రాజీనామా చేసి రాజకీయాల్లో ఉత్కంఠకు తెరా తీశారు. గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లాలోని టీఆర్‌ఎస్‌లో ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెర వెనుక రాజకీయలు నడుపుతూ జిల్లాలో తిరిగి తన పట్టు నిలబెట్టుకోవడానికి డిల్లీలోని రాజకీయ నేతలతో చర్చలు జరిపి కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి గత కొన్ని రోజుల క్రితమే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని 7నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగలిందని చెప్పవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈనెల 23న మేడ్చల్‌లో జరగనున్న కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభలో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నాడు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన వార్తతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డితో పాటు జిల్లాలోని ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీతో పాటు శాసన సభకు పోటీ చేసిన ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మనోహార్‌రెడ్డి, శంకర్‌గౌడ్‌లతో పాటు మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీ,ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోవడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యునిగా కొనసాగుతున్నప్పటికి జిల్లాలో కొంతమంది టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సహకరించకపోవడంతో తన అనుచర వర్గానికి జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వ తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతోనే మనస్థాపానికిగురై ఈ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విశ్వేశ్వర్‌రెడ్డి శాసన సభ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడం వల్ల చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో ఎన్నికల శాసన సభ బరిలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారే పరిస్థితులున్నాయని, ఈ పరిస్థితుల్లో అనేక మంది పార్టీని విడితే టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని పలువులు చర్చించుకుంటున్నారు.