టి-టిడిపిలో..స్తబ్దత..?

TDP
TDP

పార్లమెంటు ఎన్నికల్లో పొత్తా? ఒంటరి పోరా?
తర్జన..భర్జనలో..పచ్చ పార్టీ నాయకులు..!
హైదరాబాద్‌: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం స్తబ్దత నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో ఊహించని విధంగా తక్కువ స్థానాల్లో గెలవటం..మహాకూటమి చలకిలపడటం ఆపార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూటమితో పొత్తు ఉంటుందా? లేక ఒంటరిగా పోటీ చేయాలా? అనే తర్జనభర్జనలో ఆపార్టీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత సాంకేతాలు ఇవ్వడంతో..ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ నేతృత్వంలో నడిచిన మహా కూటమితో కూడా తమ పార్టీకి పొత్తు ఉండలా? వద్దా? అనే విషయంపై వారు మంతనాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుని 15 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానాన్ని టిడిపి గెలిచింది. బిజెపి కూడా ఐదుగురు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని గెలిచింది. ఆ పొత్తుతో ఇరుపార్టీలు రాజకీయంగా బలపడటంతోపాటు..లాభపడ్డాయి. కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే అంచనాలు అన్నీ తలకిందులు కావటం టిడిపి-టిఎస్‌ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఎన్నికల్లో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలవటం వారు తట్టుకోలేపోతున్నారు. అధికార పార్టీ ఒకవైపు విచ్చలవిడిగా డబ్బులు..మద్యాన్ని పంచడం..మరోవైపు ఈవిఎంలో కూడా అక్రమాలకు తెరలేపడం వల్లనే తమ ఓటమికి గురయ్యామని వారు ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో రెండు నెలల్లో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లోనైనా చెప్పుకోదగ్గ ఎంపీ స్థానాలను గెలవటానికి ఉపయోగపడే వ్యూహాన్ని రచిస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తర్వాత మూడో స్థానంలో సర్పంచ్‌ను గెలుస్తున్న టిడిపిని బలోపేతం చేసి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపేందుకు సమాయత్తమవుతోన్నారు. ఇందుకు గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల వివరాలను సేకరిస్తున్నారు. బలంగా ఉన్నామని నిర్దారణకు వచ్చిన పార్లమెంటు స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ మహాకూటమితో పొత్తు ఉంటే ఒకవిధంగా..లేకపోతే మరొక విధంగా వ్యవహరించేందుకు యోచిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో టిడిపికి వచ్చిన ఓట్లను కూడా తెలుసుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసే ఆసక్తి ఉన్న నాయకుల వివరాలను సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలన్ని తలకిందులు చేస్తూ వచ్చిన ఫలితాలతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు కొంత జంకుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈదశలో పార్టీకి కొంత బలమున్న స్థానాల్లో సీనియర్‌ నేతలతోపాటు..కొత్తవారు, ఉత్సహవంతులపై ఆరా తీస్తున్నారు. మార్చిలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపుగానే తెలంగాణలోని పార్లమెంటు స్థానాల వారీగా బలబలాలు..పోటీకి ఆసక్తి ఉన్న నాయకుల వివరాలు..గెలుపు వ్యూహాలను సిద్దం చేసేందుకు టిడిపి తెలంగాణ నాయకత్వం కసరత్తును ప్రారంభించింది.