టిడిపి-వైఎస్సార్సీ ఘ‌ర్ష‌ణ‌లు.. ఉద్రిక్త‌తం

TDP, YSRCP
TDP vs YSRCP

కడపః జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరులోటీడీపీ-వైఎస్సార్సీ వర్గీయుల ఘర్షణతో ఉద్రిక్తత చెలరేగింది. పెద్దదండ్లూరుకు చెందిన సంపత్‌ అనే వ్యక్తికి ఈమధ్యే వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరు కాలేకపోయిన ఎంపీ అవినాష్ రెడ్డి పెద్దదండ్లూరుకు వెళ్లి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నారు. గ్రామంలో కూడా ఎంపీని ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైసీపీ ఇన్‌ఛార్జి సుధీర్‌రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు పెద్దదండ్లూరు గ్రామానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈలోగా దేవగుడి గ్రామం నుంచి సుమారు 250 మంది మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు గ్రామంలోకి వచ్చి వైసీపీకి చెందిన గోకుల అజరయ్య, అయ్యవార్‌రెడ్డి, కుళాయిరెడ్డి తదితరుల ఇళ్లపై దాడి చేశారు. సోమోజిరెడ్డిపల్లిలో వివాహానికి హాజరైన అవినాష్‌ రెడ్డి…. తమ అనుచరులను వైసీపీలోకి లాగే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సంపత్‌ ఇంటి దగ్గర వేసి ఉన్న షామియానా, కుర్చీల్ని మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పెద్దదండ్లూరు గ్రామంలోకి ఎంపీని, టీడీపీ నేత రామసుబ్బారెడ్డిని రానీయకుండా మంత్రి వర్గీయులు అడ్డుకున్నారు. గువ్వల శ్రీనివాసులరెడ్డి, రామసుబ్బారెడ్డి, సావిత్రి అనే ముగ్గురిపై కర్రలతో దాడి చేసి, ఏరువ సంజీవరెడ్డి ఇంటి వద్ద మంత్రి వర్గీయులు స్కార్పియోను ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులపై కూడా కొందరు రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న జమ్మలమడుగు డీఎస్పీ కోలా కృష్ణన్‌ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సుగుమంచిపల్లె గనుల సమీపాన వైసీపీ ఇన్‌ఛార్జి సుధీర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. పెద్దదండ్లూరులో వైసీపీ కార్యకర్తలతో పాటు మండలి విప్‌ పి.రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన హనుమంతరెడ్డి, సంజీవరెడ్డిలపై దాడి జరగడంతో విషయం తెలుసుకున్న రామసుబ్బారెడ్డి కొండాపురం నుంచి పెద్దదండ్లూరుకు బయలుదేరారు. అయితే జమ్మలమడుగు పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ కు తరలించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్దదండ్లూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య మళ్లీ ఘర్షణలు జరగకుండా, గ్రామంలోకి ఇతరులు చొరబడకుండా భారీగా పోలీసులు మోహరించారు. జమ్మలమడుగు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అనుచరులను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులది నీచసంస్కృతి అని తమ అనుచరులపై అన్యాయంగా దాడి చేశారని ఆయన ఆరోపించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.