టిడిపి ద్వంద్వ వైఖరి ప్రజలను మభ్యపెట్టేలా ఉందిః ఎంపీ

న్యూఢిల్లీః పార్లమెంట్ ఉభయ సభల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్నది రాజకీయ ఎత్తుగడని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నుంచి టీడీపీ బయటికొచ్చినా ప్రజలు నమ్మరని అన్నారు. ఎన్నికల ముందు ఎత్తుగడలో భాగం అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని మేకపాటి వ్యాఖ్యానించారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు చేస్తున్నది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఆందోళన కాదని అన్నారు. కేంద్ర కేబినెట్లో భాగస్వామ్యంగా ఉన్న పార్టీ, మంత్రులుగా కొనసాగుతూ ఏ విధంగా ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే చిత్తశుద్ధి టీడీపీకి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని, బయటకు వచ్చి పోరాటం చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కేవలం ప్రజలను మభ్యపెట్టి, ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.