టిఎన్జీవోలు ప్రభుత్వ కుటుంబ సభ్యులు!-ఎంపీ కవిత

KavithaKalvakunatla Kavitha
Kalvakunatla Kavitha

నిజామాబాద్‌: టిీఎన్జీవోలు ప్రభుత్వ కుటుంబసభ్యులని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అభివర్ణించారు. శనివారం నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన టిఎన్జీవో స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి అమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె సమావేశానికి ప్రారంభించారు. అనంతరం కవిత మాట్లాడుతూ ప్రభుత్వం-ఉద్యోగులు వేరుకాదన్నారు. దీపం వెలుతురును వీడదీయలేనట్లే..ఉద్యోగులు ప్రభుత్వాన్ని కూడా వీడదీయలేమన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అమలు చేసేది ఉద్యోగులేనన్నారు. తమది ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని సిఎం కేసిఆర్‌ ప్రకటించిన విషయాన్ని కవిత ఈసందర్బంగా గుర్తు చేశారు. కాగా ఉద్యోగుల కోసం పోరాటం చేస్తూనే తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్న సంస్థ టిఎన్జీవో అని కవిత కొనియాడారు. 1969లో ఉద్యమం వచ్చి వెనక్కిపోయిందన్నారు. 2001లో మళ్లీ ఉద్యమం మొదలైందని..కొంతరు రాజకీయ నాయకుల ఆలోచన విధానం మారినప్పటికీ ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించిన సంఘం టిఎన్జీవో అని కొనియాడారు.610 జీవో సాధించిన ఘనత కూడా టిఎన్జీవో సంఘందేనని కవిత గుర్తు చేశారు. సెక్రటేరియట్‌లో సిఎం, జిల్లాల్లో కలెక్టర్ల ముందు ఉండి కూడా ఉద్యమం చేసిన తీరు సమాజం మరిచిపోదన్నారు. 14 ఏళ్లు నిప్పును చేత్తో పట్టుకుని ఉద్యమం చేశారు కాబట్టే సిఎం కేసిఆర్‌కు టిఎన్జీవోలంటే ఎనలేని ప్రేమన్నారు.