జ‌న్మభూమి కార్య‌క్ర‌మంలో మంత్రి మండిపాటు

Manikyala rao
Pydikonda Manikyala rao

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ-బీజేపీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.. తాడేపల్లిగూడెం మండలంలోని రామన్నగూడెంలో ఈరోజు ‘జన్మభూమి’ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ శ్రీనివాస్ వర్గంపై ఏపీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు మండిపడ్డారు. ఈ సభలో ఆయన  మాట్లాడుతూ, ‘నా నియోజకవర్గం (తాడేపల్లిగూడెం)లో నన్నే అంటరానివాడిగా చూసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. చివరకు, రామన్నగూడెంలో కూడా నాకు అలాంటి  పరిస్థితే ఎదురైంది. ఈ ఊరులో ఏదైనా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారా? నేను ఏమైనా శత్రువునా? ప్రతి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రిగారి పక్కన కూర్చునే వ్యక్తిని నేను. నేను స్పష్టంగా ప్రశ్నిస్తే చాలా మందికి బాధ కలుగుతోంది. నన్ను నిలదీసే పరిస్థితి వస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తా. నన్ను పక్కకు తప్పించాలని చూస్తే .. ఆంధ్రప్రదేశ్ కు నిధులు రాకుండా కట్ చేస్తానని చాలా స్పష్టంగా చెబుతున్నా. సహనానికి కూడా హద్దులుంటాయి. మూడున్నర సంవత్సరాల పాటు సహనంతో ఉన్నా. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కలిసి పని చేస్తున్నాం. నియోజకవర్గాన్ని కేంద్రం నిధులతోనే అభివృద్ధి చేశా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. నన్ను అడ్డుకోవాలని చూస్తే మగాడినై రెచ్చిపోతా’ అని మండిపడ్డారు.