జో బైడెన్‌ కీలక ఉత్తర్వులు జారీ

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి కారణంగా ఇన్నాళ్లు మూతపడిన పాఠశాలలను తిరిగి తెరవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు నూతన మార్గదర్శకాలను శుక్రవారం అధ్యక్షుడు జారీ చేశారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ‘అమెరికాలో వీలైనన్ని ఎక్కువ పాఠశాలలను తక్కువ కాలంలో సురక్షితంగా తెరవడమే అధ్యక్షుడిగా నా లక్ష్యాల్లో ఒకటి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు వారాల్లోనే కరోనా విషయంలో గొప్ప ఫలితాలు రాబట్టాం. గత ప్రభుత్వ హయాంలో కరోనా టైంలో తెరుచుకున్న పాఠశాలల కంటే ఈ మూడు వారాల్లోనే ఎక్కువ స్కూల్స్ తెరవబడ్డాయి. గత సంవత్సరంలో చాలా త్యాగాలు చేశాం. మన విద్యార్థులకు, విద్యావేత్తలకు, సమాజానికి అవసరమైన వనరులతో మద్దతివ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మరిన్ని ప్రాంతాల్లో సురక్షితంగా పాఠశాలు తెరవగలమని ఆశిస్తున్నాం. సురక్షితమైన వాతావరణంలో మాత్రమే పాఠశాలలు తెరవబడుతున్నాయి. ఎప్పటికప్పుడు తరగతి గదుల క్లీనింగ్, క్లాస్‌రూమ్స్‌లో విద్యార్థుల మధ్య సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనల అమలు ఉంటుంది. కనుక పిల్లల ఆరోగ్య భద్రతపై పేరెంట్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.’ అని చెప్పుకొచ్చారు.

అటు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్(సీడీసీ) కూడా స్కూళ్ల ఓపెనింగ్స్‌పై పలు కీలక సూచనలు చేసింది. పాఠశాల బస్సులు, క్లాస్‌రూమ్స్‌లో విద్యార్థులు సామాజిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం చేయాలని తెలిపింది. ఇదిలాఉంటే.. ప్రపంచంలోనే కరోనా వైరస్‌తో అధికంగా దెబ్బతిన్న దేశాల జాబితాలో అగ్రరాజ్యం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.74 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. ఇందులో 4.80 లక్షల మంది చనిపోయినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది.