జో బైడెన్‌తో మాట్లాడిన ప్రధాని మోడి

బైడెన్ కు శుభాకాంక్షలు తెలిపిన మోడి
న్యాయబద్ధ పాలనకు కట్టుబడాలని నిర్ణయం

న్యూఢిల్లీ: అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్రమోడి మొదటిసారి ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోడియే నిన్న రాత్రి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా బైడెన్ ‌కు మోడి శుభాకాంక్షలు తెలిపారు. తాము ఇరువురమూ పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చించుకున్నామని మోడి తెలియజేశారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు లక్ష్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇద్దరమూ నిర్ణయించుకున్నామని తెలిపారు. వాతావరణ మార్పులపై జరుగుతున్న పోరులో సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించామన్నారు.

‘అధ్యక్షుడు బైడెన్, నేను న్యాయబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడం ద్వారా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి సుస్థిరతలను పెంచేందుకు కట్టుబడి ఉన్నాం” అని మోడి ట్వీట్‌ చేశారు. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయగానే, మోడి, తన ట్వీట్ల ద్వారా అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా, తొలిసారి ఇరు దేశల నేతలూ ఫోన్ లో మాట్లాడుకుని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.