జెఎన్‌యు ఘటనలు బాధాకరం

బిజెపి భావజాలాన్ని వ్యతిరేకిస్తే దేశద్రోహులా?
గాంధీ కుటుంబాన్ని విమర్శించే హక్కు బిజెపికి లేదు
పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌ : దేశరాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాల యంలో జరగుతున్న ఘటనలు చాలా బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దేశంలోని లౌకికవాదులు, ప్రజాస్వామ్య వాదులు వీటిని ఖండించాలని కోరారు. శుక్రవారం గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన అధికారం కోసం జమ్మూ, కాశ్మీర్‌లో వేర్పాటువాద శక్తులతో జతకట్టిన పిడిపితో పొత్తు పెట్టుకున్న బిజెపి జాతీయత, దేశభక్తి అంటు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతోందని విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీపై విమర్శలు చేయడం మతతత్వశక్తులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలను రాజకీయవేదికలుగా మార్చిన బిజెపి అనుబంధ విద్యార్థి విభాగం అనుసరిస్తున్న ధోరణి అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురుకు విధించిన శిక్షను కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించలేదన్న ఆయన కాంగ్రెస్‌ దేశద్రోహులకు ఏనాడు మద్దతు ఇవ్వబోదన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావాజాలాన్నీ విశ్వవిద్యాల యాల్లో జొప్పించే క్రమంలో అడ్డుపడిన వారిపై దేశద్రోహులనే ముద్రవేస్తున్నదన్నారు. కన్నయ్య కుమార్‌పై కేసులు పెట్డడాన్నీ ఖండిస్తున్నట్లు తెలిపారు.పాటియాల కోర్టువద్ద న్యాయవాదులు, పాత్రికేయులపై జరిగిన దాడికి మతతత్వవాదులు కారణమని ఆరోపించారు.పోలీసులు వ్యవహరించిన తీరు సబబుగా లేదన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల అక్రమాలపై అఖిలపక్షం…
రాష్ట్రంలో నిర్మాణమవుతున్న భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి,అక్రమాలు చోటుచేసు కుంటున్నాయని ఆరోపించిన ఉత్తమ్‌ వేలకోట్ల రూపాయల కుంభకోణంపై త్వరలో అన్ని రాజకీయపక్షాలతో కలసి అఃలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తా మన్నారు.పిసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ రావు, కిసాన్‌సెల్‌ చైర్మెన్‌ ఎం.కోదండరెడ్డి పాల్గొన్నారు.