జూరాల‌కు వ‌ర‌ద జోరు

Jurala Dam
Jurala Dam

జోగుళాంబ గద్వాల : ఎగువ ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,50,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ప్లో 1,52,099 క్యూసెక్కులు నమోదైంది. దీంతో ప్రాజెక్ట్‌లోని 18 గేట్లలో 2 గేట్లను 0.5 మీటర్ ఎత్తుకు, 2 గేట్లను మీటర్ ఎత్తుకు, 5 గేట్లు 1.5 మీటర్ల ఎత్తుకు, 8 గేట్లను 2 మీటర్ల ఎత్తుకు, 1 గేటును 2.5 మీటర్లు ఎత్తుకు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,07,399 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1,044.455 అడుగుల ఎత్తులో 9.316 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 737 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1,400 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 1,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం పవర్‌హౌజ్ ద్వారా 40,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రిజర్వాయర్లకు నింపేందుకు భీమా లిఫ్ట్-2 ద్వారా1500 క్యూసెక్కులు, నెట్టెంపాడు ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 630 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. సుంకేశుల ఇన్‌ఫ్లో 89,353 క్యూసెక్కులు ఉండటంలో బ్యారేజ్‌లో 18 గేట్లను 1 అడుగు మేర ఎత్తి 87,262 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ఇన్‌ఫ్లో 1,28,770 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,28,770 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్ ఇన్‌ఫ్లో 1,44,959 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,42,232 క్యూసెక్కులు నమోదైంది. తుంగభద్రకు స్వల్పంగా వరద కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో 50,752 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 30,389 క్యూసెక్కులు నమోదుకాగా, ప్రాజెక్టులో 10 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి నీటిని స్పిల్ వే ద్వారా 14,790 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.