జీవితం ఒక హరివిల్లు

IMG--
Couple

జీవితం ఒక హరివిల్లు

జీవితం ఎవరికీ అందంగా ఉండదు. మనకు మనమే మన జీవితాన్ని అందంగా, ఆనందంగా ఉండేలా మలచుకోవాలి. జీవితమనేది ఒక హరివిల్లు వంటిది. సుఖం, దుఃఖం, వేడుక, వేదన, గెలుపు, ఓటమి, లాభం, నష్టం వీటి సమ్మేళనమే జీవితం. హరివిల్లు ఏర్పడాలంటే వర్షం, వెలుగు రెండూ కావాలి. మరి సంతోషం, దుఃఖం, ఆశ, నిరాశ, మంచి చెడుల సమ్మేళనమే జీవితం. జీవితం చిన్నది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రోజు జీవించాలి, నచ్చిన పనులు చేయాలని అంటారు కొందరు. కాని జీవితం పట్ల నెగటివ్‌ దృక్పథంతో ఉండకూడదు. అలాంటి దృక్పథం ఉన్నవారితో సన్నిహితంగా ఉండడం వల్ల వారి ప్రభావం మనసు మీద, ఆలోచనల మీద పడి సొంత నిర్ణయాలు తీసుకోలేనివారు ఇతరులను త్వరగా ప్రభావం చేస్తారు. ప్రతి చిన్న విషయానికి బాధపడడం, ఎక్కువగా ఆలోచించడం ఆరోగ్యానికి మంచిది కాదు. మనసులో ప్రతికూల ఆలోచనలే దీర్ఘకాలంలో అనారోగ్యానికి దారి తీస్తాయి. జీవితంలో ఎదురయ్యే సంఘటనలను పాజిటివ్‌గా చూస్తూ హాయిగా ఉండే మనసుకే కాదు శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన శక్తి, మన బలంకన్నా మన సహనం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. జీవితంలో వ్యాపారం చేయాలనుకున్నప్పుడు జీవితమే వ్యాపారంగా చేయకూడదు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తొందరపడకూదు. ప్రశాంతంగా ఆలోచించి జీవితం మనకేమి నేర్పింది అన్నది గ్రహించాలి. ఉన్నంతలో సంతృప్తితో జీవించటం నేర్చుకుంటే అసంతృప్తి దరచేరదు. నిరాశావాదాన్ని దగ్గరకు రానీకూడదు. తరచు కోపం వచ్చే సందర్భాలను గుర్తించి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సంపాదన గురించి ఆలోచనా వైఖరి మారాలి. ఆదాయం ఒక్కటే ముఖ్యం కారాదు. జీవితంలో మన ఆలోచనలతోనే విజయం సాధించగలం.
– ఆర్‌విఎంఎస్‌