జీర్ణశక్తిని పెంచే జామ

guava fruit
guava fruit

జీర్ణశక్తిని పెంచే జామ

బాగా పండిన జామపళ్లు అరుగుతాయి. చలవచేస్తాయి. రొంపను పోగొడతాయి. శరీరానికి సమశీతోష్ణస్థితి కల్గిస్తాయి. ధాతువ్ఞలన్నింటిని సమస్థితికి తెస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. వాతం చేస్తాయని చాలామంది దురభిప్రాయం. నిజానికి జామపండు వాతాన్ని తగ్గిస్తాయి. పడనివారికి జలుబు చేస్తుంది. లివర్‌ వ్యాధులకు మంచిది. జీర్ణశక్తిని బట్టి తరచూ తీసుకోవచ్చు. బాగా పండిన జామపండు రసం తీసుకుని వాము కలిపి ఎండబెట్టాలి. మర్నాడు అదే వాములో మళ్లీపండిన జామపండు రసం కలిపి దాన్ని ఎండబెట్టాలి.

ఇలా వారం రోజుల పాటు ఎండబెట్టిన ఆ వాము మెత్తగా పొడిచేసి చిన్నచిన్న మాత్రలుగా చేసి పిల్లలకు తినిపిస్తే అమితమైన బలాన్నిస్తుంది. కడుపులో వచ్చే రోగాలన్నింటికీ మంచిది. అజీర్తి, నొప్పి, విరేచనాలు, మలబద్ధకం, వాంతులు, పసిపిల్లలు పెరుగులా కక్కుకోవడం వంటివి చక్కగా తగ్గుతాయి. వయసుని బట్టి, జీర్ణశక్తిని బట్టి మోతాదుని నిర్ణయించుకోవాలి. జామచెట్టు వేరుని నీళ్లలో మరిగించి తీసి ఆ నీళ్లలో తీపి కలుపుకుని తాగితే నీళ్లవిరేచనాలు తగ్గుతాయి. ఆకులు లేతవి తీసుకుని దంచి కషాయం కాచుకుని తాగితే కలరా, రక్తవిరేచనాలు తగ్గుతాయి. వాంతుల్ని ఆపుతాయి. జామచెట్టు కాండం పై చర్మం కూడా ఇలానే పనిచేస్తుంది. లేత జామ ఆకుల్ని నమలడం, కషాయాల్ని పుక్కిట పట్టడం చేస్తే పంటిపోటు, నొప్పి, గొంతులో కాయలు, వాయడం వంటివి తగ్గుతాయి. లేత ఆకులను నూరి గడ్డపైన కట్టు కడితే త్వరగా పక్వానికొచ్చి పగులుతుంది.