జిహెచ్‌ఎంసి ఎన్నికలంటే టిఆర్‌ఎస్‌కు భయం పట్టుకుంది!

Kishan Reddy
– ప్రత్రిపక్షాలను ప్రచారం చేసుకోనీయకుండా కుట్ర
– టిఆర్‌ఎస్‌ దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతోంది
– తెలంగాణలో రోడ్లకు 43 వేల కోట్ల ప్యాకేజీ
రికార్డు : రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలంటే టిఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని తెలంగాణ బిజెపి రాష్ట్ర అద్యక్షులు, ఎమ్మెల్యే జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. గెలుపుప ధైర్యం లేకనే రిజర్వేషన్ల ప్రకటనపై ప్రభుత్వం తాత్సారం చేస్తుదంని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియ గడువు కుదింపుతో ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకోనీయకుండా టిఆర్‌ఎస్‌ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. బడుగు, బలహీనవర్గాలు, మహిళలు ప్రచారం చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా టిఆర్‌ఎస్‌ వ్యవహరిస్తుందని ఆయన ఘటాగా ఆరోపించారు. టిఆర్‌ఎస్‌ దివాళకోరు రాజకీయాలకు ఇది నిదర్శమని కిషన్‌రెడ్డి దుయ్య బట్టారు దొంగదారుల్లో గెలవాలనుకుంటున్న టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలను తాము వమ్ము చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, ఎస్‌. కుమార్‌, వెంకటేశ్వర్లు, సీనియర్‌ నాయకుడు మోచినేని కిషన్‌రావులతో కలిసి నిర్వహించిన విలేకరులు సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. 22 రోజులుండే గ్రేటర్‌ ఎన్నికల ప్రచార ప్రక్రియను 14 రోజులకు కుదించడంపై ఆయన మండిపడ్డారు. దీంతో ప్రచారానికి కేవలం ఆరురోజులే ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1965నుండి అమలవుతున్న ఎన్నికల నిబంధనలను టిఆర్‌ఎస్‌ హఠాత్తుగా మార్చడం అప్రజాస్వామి కమని, రాజ్యాంగ విరుద్దమని ఆయన ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ దిక్కుమాలిన రాజకీయాలకు, రాచరికపు పోకడలకు, నిజాం నిరంకుశ విధానాలకు ప్రత్యక్ష నిదర్శమని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల నిర్వహించకుండా హైకోర్టుకు కూడా రకరకాల సాకులు చూపిందన్నారు. జనాభా పెరిగినందున పాత 150 డివిజన్లను 200కు పెంచాలని, అందుకు సమయం కావాలని జాప్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ పాత 150 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లటం ద్వంద్వనీతికి నిదర్శమనిఆయన దుయ్యబట్టారు. ఇంత దివాళకోరు..దిక్కుమాలిన ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల దరఖాస్తులను ఎమ్మార్వో, కలెక్టర్‌ కార్యాలయాల్లో తీసుకోవడం లేదని..పరోక్షంగా టిఆర్‌ఎస్‌ నాయకుల వద్ద తీసుకొమ్మని అధికారులే చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఇందుకు 500లన ఉండి రూ.4 వేల వరకు దరఖాస్తుల కోసం తీసుకుంటున్నారని విమర్శించారు. తమపై ప్రజల్లో విశ్వాసం లేదనే దొడ్డిదారిన గ్రేటర్‌లో గెలువాలని టిఆర్‌ఎస్‌ అనేక కుట్రలు, కుతంత్రాలకు తెరలేపిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇలా అయితే బంగారు తెలంగాణ సాధ్యమేనా? అని ఆయన ప్రశ్నించారు. కేసిఆర్‌, ఆయన కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరిల కృషి వల్ల తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, అభివృద్దికి రూ.43 వేల కోట్లతో ప్యాకేజీని ప్రకటించడం రికార్డు అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని దీనితో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ ఎన్ని నాటకాలు వేసినా గ్రేటర్‌లో బిజెపి-టిడిపి కూటమికి విజయం ఖాయమని కిషన్‌రెడ్ది ధీమా వ్యక్తం చేశారు.