జిఎస్‌టి, నోట్లరద్దుతో భారత్‌ ఆర్ధికవృద్ధి వెనుకంజ

RAGHURAM RAJAN
RAGHURAM RAJAN

మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌
వాషింగ్టన్‌: పెద్దనోట్ల రద్దు, వస్తుసేవలపన్ను చట్టాలను అమలుచేయడంద్వారా భారత ఆర్ధికవృద్ధి గత ఏడాది వెనుకంజవేసిందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం సాధించిన ఏడుశాతం వృద్ధి ఎంతమాత్రం దేశ అవసరాలకు సరిపోదని ఆయన అన్నారు. బర్కిలీలో కాలిఫోర్నియా వర్సిటీహాలులో జరిగిన సదస్సులో మాట్లాడుతూ నాలుగేళ్లపాటు అంటే 2012 నుంచి 2016 వరకూ భారత్‌ శరవేగంగా అభివృద్ధిచెందిందని, తర్వాత రెండు అంశాల కార్యాచరణతో ఆర్ధికవృద్ధికి విఘాతం కలిగిందనిఅన్నారు. పెద్దనోట్ల రద్దు,జిఎస్టీ అమలుద్వారా భారత్‌ వృద్ధి వెనుకడిందని, అదేసమయంలో ప్రపంచ ఆర్ధికవృద్ధి మెరుగుపడిందని అన్నారు. భారత్‌ భవిష్యత్తుపై భట్టాచార్య రెండో స్మారక ఉపన్యాసంలో ఆయన భారత్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలుచేసారు. ఏడాదికి ఏడుశాతం వృద్ధి 25ఏళ్లవరకూ పటిష్టంగానే ఉన్నట్లు లెక్క అని, అయితే కొత్త హిందూ వృద్ధిరేటు అంతకుముందు మూడున్నరశాతంగా మాత్రమే ఉందన్నారు. వాస్తవాల్లోనికి వెళితే ఏడుశాతం వృద్ధి ఎంతమాత్రం సరిపోదన్నారు. ఉపాధిరంగం మరింత మెరుగుపడాలని, ఈస్థాయి ఎంతమాత్రం సరిపోదన్నారు. భారత ప్రపంచ వృద్ధికి సమాంతర వృద్ధిలేదని, భారత్‌ మరింతగా పారదర్శక ఆర్ధికవ్యవస్థ ఉన్న దేశం కావడం వృద్ధికి మరింత ఆస్కారం ఉన్నదేశంగా పేర్కొన్నారు. ప్రపంచ వృద్దికి సమాంతరంగా మరింత వృద్ధిచెందాలన్నారు. 2017లో ప్రపంచం మొత్తం వృద్ధిచెందుతున్న దశలో భారత్‌ వెనుకంజవేసిందని, వీటికి జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దే కారణమని పేర్కొన్నారు. వీటిని అధిగమించి వృద్ధి చెందుతున్న దశలో ముడిచమురుధరలు కొంతకారణం అయ్యాయని, భారత్‌ ఎక్కువగా దిగుమతులపైనే చమురు అవసరాలున్నందున ఎంతో కీలకం అయిందన్నారు. చమురుధరలు పెరుగుతుండటంతో భారత్‌ ఆర్ధికవ్యవస్థకు కొంత భారం అయిందని, జిఎస్‌టి,పెద్దనోట్లరద్దునుంచి కోలుకుంటున్న తరుణంలోనే ముడిచమురుదరలు శరాఘాతంగా తగిలాయన్నారు. ఇక బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెరుగుతున్న నిరర్ధక ఆస్తులు, ప్రస్తుతం అమలుచేస్తున్న క్లీన్‌అప్‌ కార్యాచరణ ఎంతో కీలకంగా మారిందని, బ్యాంకుల ఆస్తి అప్పులపట్టీలు మెరుగుపడాల్సి ఉందన్నారు. ఏడుశాతానికి దిగువన ఆర్ధిక వృద్ది ఉంటే మనం తప్పుచేస్తున్నట్లే లెక్క అని అన్నారు. వచ్చే పది పదిహేను ఏళ్లకుగాను భారత్‌ ఈస్థాయి వృద్ధితో ముందుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికశక్తికి అదనంగా వనరులు అవసరమని, నెలకు పదిలక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మౌలికవనరులరంగంపరంగా నిర్మాణరంగం వృద్ధిలోనికి రావాలని,విద్యుత్‌రంగంలో స్వల్పకాలిక సమస్యలు రద్దుచేయాలని, బ్యాంకులను ప్రక్షాళన చేయాల్సి ఉందని అన్నారు. ఆర్ధికవృద్ధికి ఎంతోకీలకమైన నిర్ణయాలు ప్రధాని కార్యాలయంనుంచి కూడా అవసరం అవుతాయని రాజన్‌ పేర్కొన్నారు. ఇటీవల ఆవిష్కరించిన సర్దార్‌పటేల్‌ విగ్రహప్రాజెక్టుకు పిఎంఒ అనుమతించిన తరహాలోనేమరికొన్ని కీలక నిర్ణయాలకు పిఎంఒ తక్షణ ఆమోదం అవసరం అవుతుందని, అప్పుడే ఆర్ధికవృద్ధి వేగవంతం అవుతుందన్నారు.