జమిలి ఎన్నికలకు జై కొడదామా?

Neeti Ayog
Neeti Ayog

జమిలి ఎన్నికలకు జై కొడదామా?

మోడీ పట్టిందల్లా బంగారం.పలికిందల్లా సింగారం. అంతే కాదు ఆయన మెదడులోంచి ఏ ఆలోచన పుట్టినా దానికి కార్యాచరణ రూపం కల్పించి శాసనంగా మార్చ గలిగే మందీ మార్బలం, చట్టసభల్లో సభ్యుల బలం పుష్కలంగా ఉన్నాయి. ఈ సారి జమిలి ఎన్నికలపైనే మోడీ దృష్టి కేంద్రీకృతమై ఉంది.గత కొన్ని నెలలుగా లోక్‌సభ, అసెంబ్లీలకు కలిపి ఏక కాలం లో ఎన్నికలు నిర్వహిస్తే కష్టనష్టాల కన్నా ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని ప్రధాని మోడీ ప్రగాఢంగా నమ్ముతున్నారు.

నీతి ఆయోగ్‌ సమావేశంలోనూ ఇదే ప్రధానాంశంగా కొంతవరకు చర్చ జరిగింది. సమావేశంలో పాల్గొన్న కెసిఆర్‌, చంద్రబాబు తదితర ముఖ్యమంత్రులూ, ప్రముఖులూ జమిలి ఎన్నికలకు వత్తాసు పల కడం విశేషం.దాదాపు అందరూ దీనికి మద్దతు పలికినట్టే అయింది. ఒకేసారి ఎన్నికలవల్ల ఆసేతు శీతాచల పర్యంతం ఒకేపార్టీ ప్రభావం అధికశాతం ఉంటే పార్టీలపరంగా కొంత ఎదురీదవలసి వస్తుందన్న ఆందోళన వివిధ పార్టీ నేతల్లో కూడా అంతర్లీనంగా ఉంది. ‘జమిలి ఎన్నికలు కార్యాచరణలోకి వచ్చే సరికి ఒకటి నుంచి నాలుగేళ్లుపడుతుందన్న అభిప్రాయంతో ప్రస్తుతానికి ఎవరూ అంత గా దీని పర్యవసాన పరిణామాలపై ఆలోచించడం లేదు. 2017 నుంచి 2020వరకు జరిగే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు అన్నిటినీ ఆర్నెలలు ముందుగానో లేక తరువాతనో సర్దుబాటు చేసి 2024 లోక్‌సభ ఎన్నికల సమయానికి అన్ని ఎన్నికలూ ఒకేసారి వచ్చేలా చూడాలని నీతి ఆయోగ్‌ ఆలోచిస్తోంది. 2024 నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి రెండు దశల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ మేరకు విధివిధానాలు తయారు చేయాలని ఎన్నికల కమిషన్‌కు సూచించింది. ఈ ఆలోచనలతో ముసాయిదా ప్రణాళిక తయారయింది.ఏప్రిల్‌ 23న ప్రధానికి, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతులను పంపిణీ చేయడమయింది. ఆరునెలల్లో తుది ముసా యిదా తయారవ్ఞతుంది. ఈ ‘జమిలి పద్ధతి వల్ల ఎన్నికల వ్యయ భారం చాలా వరకు తగ్గుతుందని అభివృద్ధి కార్యక్రమాల అమలుకు చీటికిమాటికి ఎన్నికల కోడ్‌ నిబంధనలు అడ్డు తగిలే అవస్థ తప్పు తుందని, శాంతి భద్రతల రక్షణకు కావలసిన బలగాలను ఒకేసారి సమకూర్చడానికి వీలవ్ఞతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇందులో ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని పరిశీలిస్తే 2009 లోక్‌సభ ఎన్నికలకు కేంద్రానికి 1115 కోట్ల రూపాయలు ఖర్చుకాగా, 2014 లో మూడు రెట్లకుపైగా అంటే 3870 కోట్లవరకు ఖర్చుపెరిగింది. 2014లో అభ్యర్థులు,ఆయాపార్టీలు కలిపి రూ.30వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్ల్టు అనధికారిక అంచనా. చీటికి మాటికి ఎన్నికలు వస్తే అభ్యర్థులకు నిధుల వేట కోసం నిర్విరామ ఆరాటం తప్పడం లేదు. అవినీతి, అధర్మం ఇవన్నీ పక్కనపెట్టి ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కోట్లు ఖర్చుపెట్టాలా అన్నదే వారి తపన అవ్ఞతోంది. ఇక రెండవ ప్రధాన అంశం ఎన్నికల కోడ్‌ ఉన్నన్నాళ్లూ ఎలాంటి అభివృద్ధి పను లు చేయడానికి వీల్లేదు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్నప్పుడు ఏ రాష్ట్రం లోనయినా ఎన్నికలుజరుగుతుంటే అక్కడ ఎలాంటి అభివృద్ధి పను లు చేయడానికి వీలుండదు. మిగతా రాష్ట్రాలన్నీ ఆ సమయంలో ఆయా అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్తుండగా ఎన్నికల రాష్ట్రం మాత్రం స్తబ్దుగా ఉండిపోవలసి వస్తుంది. అంతేకాదు పరిపాలనపై కూడా ప్రభావం పడుతుంది. ఇక శాంతిభద్రతల పరిరక్షణ సరేసరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జమిలి ఎన్నికల వల్ల మేలు జరుగుతుం దని నీతి ఆయోగ్‌ స్పష్టం చేస్తోంది. ఇప్పుడు జమిలి ఎన్నికల వల్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలవ్యయాన్ని ఉమ్మడిగా భరించడా నికి వీలవ్ఞతుంది. అసెంబ్లీ ఎన్నికల వ్యయం ఎంతయితే రాష్ట్రం భరిస్తుందో ఆ మేరకు ఆడిట్‌ నివేదిక సమర్పించాక ఆ మొత్తాన్ని కేంద్రం చెల్లిస్తుంది. 1952లో ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి. 1957, 62,67 వరకూ అదే విధంగా ఎన్నికలు సాగాయి.

1968, 69లో అనేక రాష్ట్రాల్లో శాసనసభలు రద్దయ్యాయి. దాంతో ఏకకాల ఎన్నికల పద్ధతికి కొంత విశ్రాంతి ఇచ్చినట్లయింది. 1970లో లోక్‌ సభ రద్దయి 1971లో ఎన్నికలు జరిగాయి. 1971లో అయిదో లోక్‌ సభ ఏర్పడి ఎమర్జెన్సీవల్ల 1977 వరకు లోక్‌సభను కొనసాగించ వలసి వచ్చింది. 1967 తరువాత ఇక ఏకకాల ఎన్నికలు జరగడా నికి అవకాశం లేకుండాపోయింది. ఇక 2014, 2015 కాలంలో ఎక్కువ రాష్ట్రాలు ఎన్నికల్లోనే ఉండడంతో మొత్తం ఏడు నెలల పాటు ఎన్నికల కోడ్‌ కొనసాగి అభివృద్ధి పనులకు అవాంతరమైంది. ప్రస్తుతం అసెంబ్లీ మనుగడ కూడా అలాగే ఉంది. 2021 వరకు ప్రతి ఆరు నెలలకోసారి రెండు నుంచి అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ పరిస్థితిని మార్చాలనే జమిలి ఎన్నికల విధానాన్ని తెరపైకి తెస్తున్నారు. 1999లో జస్టిస్‌ జీవన్‌రెడ్డి న్యాయ సంఘం,2015 డిసెంబర్‌లో పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుల ఆధారంగానే జమిలి ఎన్నికల ప్రక్రియకు నివేదిక తయా రైంది. అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంత సులువ్ఞ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో ఉత్తర ప్రదేశ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు ఎన్ని కలు జరిగాయి.2018లో గుజరాత్‌, కర్ణాటక,నాగాలాండ్‌, మేఘా లయ, హిమాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు , 2019లో ఎపి, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, సిక్కిం, మధ్యప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర ఒడిశాలకు, 2021లో అసోం, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళ రాష్ట్రాలకు ఎన్నికలు జరగవ లసి ఉంది. ఇప్పుడు ‘జమిలి విధానంలో కొన్ని రాష్ట్రాలకు సమస్య ఎదురవ్ఞతుంది.

2018లో ఎన్నికలు జరగాల్సిన చోట ఆయా శాసనసభలను కొన్ని నెలలపాటు పొడిగిస్తే నవంబరులో జమిలికి వీలవ్ఞతుంది. 2019లో జరగాల్సిన చోట 2018లో అంటే ముందుగా ఎన్నికలు జరపాలి. ఏదిలాగున్నా 2018 నవంబరులో ఎన్నికలు జరిగితే 17 రాష్ట్రాల్లో సమస్యలుండకపోవచ్చు. 2021, 2022లో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాల్లో ‘జమిలి సాధ్యమేనా అన్నది చర్చనీయాంశం అవ్ఞతుంది. ఈ రాష్ట్రాల్లో మూడు, నాలుగేళ్లకు ముందుగా ఎన్ని కలకు సిద్ధం కావడం ఎలా సాధ్యం అన్నదే ప్రశ్న. శాసనసభల పదవీకాలాన్ని పెంచాలన్నా, కుదించాలన్నా రాజ్యాంగ సవరణ అవ సరమని నిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్‌ 83,172లలో చట్ట సభల గడువ్ఞలు ఒక ఏడాదిపాటు పొడిగించడానికి వీలుంది. పొడి గింపు కన్నా, ముందుగా రద్దు చేయాలనుకుంటే ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకురాక తప్పదు. ఇలా పొడిగించడం, కుదించడంపై అభ్యంతరాలు ఎవరైనా లేవదీసి కోర్టులకెక్కితే ఏమ వ్ఞతుందో ఎవరూ తేల్చలేకపోతున్నారు.

-పెట్ల వెంకటేశం