జబ్బు పడిన యంత్ర విద్య!

           జబ్బు పడిన యంత్ర విద్య!

mechanical education
mechanical education

-పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్‌ కాలేజీలు..
-దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
-అవసరాలకు తగ్గట్టుగా లేని కోర్సులు
-చదివింది ఒకటి..చేస్తున్నది మరొకటి..
-చికిత్స అవసరమంటున్న నిపుణులు
హైదరాబాద్‌: రోజు రోజుకు మారుతున్న శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా,డిమాండ్‌ ఉన్న కోర్సులు ఇంజనీరింగ్‌ విద్యలో రావడం లేదనేది వాస్తవం. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో గతంలో ప్రవేశపెట్టిన కోర్సులు మినహా ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఒక్కటంటే ఒక్క కోర్సు ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు.వెరసి విద్యార్ధులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెద్దగా లభించడం లేదు.హైదరాబాద్‌ మహానగరంలో ప్రతి ఏటా ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటున్నారు.

ఇలా పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్న వారందరికి నైపుణ్యాల లేమితో 70శాతం మంది అభ్యర్ధులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు.ఇలా మిగిలిపోయిన వారు నగరంలో చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ,నెలకు ఆరేడువేల రూపాయల సంపాదనతో కాలం వెల్లదిస్తున్నారు.తద్వారా ఇంజనీరింగ్‌ విద్యలో రీఇంజనీరింగ్‌ అవసరం ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ విద్యలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇప్పటికే ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు యూనివర్సిటీలు చర్యలు చేపడుతున్నా,వాస్తవంలో ఆ దిశగా ప్రయత్నాలు ఏ మాత్రం జరగడం లేదు.ఇంజనీరింగ్‌ విద్యకు డిమాండ్‌ ఉన్నటువంటి కోర్సులు అనేకం ఉన్నాయి.సివిల్‌,మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో అనేక మార్పులొచ్చాయి.సాంకేతికత కొత్తపుంతలు తొక్కింది.ఇంజనీరింగ్‌ విద్యలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ కోర్సుకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పాడుతోంది.

మైక్రోసాప్ట్‌,ఐబీఎం,ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీలే కొన్ని కోర్సులకు సర్టిఫికెట్‌ ఇస్తూ వాటిని నెర్చుకునేలా విద్యార్ధులను ప్రోత్సహిస్తున్నాయి.కానీ,విద్యాసంస్థలు మాత్రం ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు.ప్రతి ఏటా వేలాది మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నా,వారికి తగినంతగా స్కిల్స్‌ లేకపోవడంతో చిన్నచిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ సంతృప్తి చెందుతున్నారు.ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో సీట్ల భర్తీ క్రమంగా తగ్గిపోతుంది.

మహానగరంలో సిమెంట్‌,ఫార్మా,ఐటీ,ఆటోమొబైల్‌,మైన్స్‌ అండ్‌ మినరల్‌,కన్‌స్ట్రక్షన్‌,టెక్స్‌టైల్స్‌ అండ్‌ అపెరల్స్‌,హార్టికల్చర్‌,పౌల్ట్రీ రంగాలకు అధికంగా ప్రాధాన్యం ఉన్నా,వాటిని అందించడానికి మన యూనివర్సిటీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం బాధాకరం.మన దగ్గర ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనుల్లో పనిచేస్తున్న వారు చాలా వరకు పక్క రాష్ట్రాల నుండి వచ్చిన ఇంజనీర్లే.ఇంజనీరింగ్‌లో కొత్త ఇంటర్న్‌షిప్‌ పాలసీని అమల్లోకి తేవాలని ఏఐసీటీఈ స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతమున్న కోర్సులకు చికిత్స చేయాలని నిపుణులు తెలుపుతున్నారు.

ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా కోర్సుల రీడిజైన్‌తో పాటు స్థానికంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ కోర్సును తీర్చిదిద్దాలని చెబుతున్నారు.అలా జరిగినప్పుడే యంత్రవిద్య పట్టభద్రులకు నిండుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు ఇంటర్న్‌షిప్‌ను విడుదల చేయడంను ఏఐసీటీఈ ఈ మధ్యకాలంలోనే తప్పనిసరి చేసింది.ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్ధుల్లో స్కిల్స్‌ మెరుగుపడతాయి.తద్వారా పారిశ్రామిక అవసరాలపై పక్కాగా స్కిల్స్‌ను నేర్చుకుంటారు.
-ఓయూ, జెఎన్‌టియుల పట్టింపు అవసరం..
ఆధునికత ఎప్పటికప్పుడు కొంతపుంతలు అవుతున్న తరుణంలో మార్కెట్‌ అవసరాలను గుర్తించి సిలబస్‌లో కొత్త మార్పులు తీసుకురావాల్సిన అవసరం యూనివర్సిటీలపైనే ఉంది.కానీ,వాటిని మన యూనివర్సిటీలు పక్కనబెట్టాయి.మన యూనివర్సిటీలు కేవలం అనుబంధ కళాశాలలకు గుర్తింపును ఇచ్చే సంస్థలుగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మార్కెట్‌ అవసరాల మేరకు కోర్సులను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తదనుగుణంగా ఉస్మానియా యూనివర్సిటీ,జెఎన్‌టియులు సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి.అప్పుడే ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించిన విద్యార్ధులకు తగిన న్యాయం జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.