బ్రిస్బేన్: టీమిండియా గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాతో నేడు రెండవ వన్డే ఆడనుంది.కాగా అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా భారీ పరుగులు చేసినా ఓడిపోయింది.ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను అడ్డుకోలేక చితికిలపడింది.ప్రత్యేకంగా కెప్టెన్ స్టీవ్ స్మిత్,జార్జి బెయిలీలు మూడవ వికెట్‌కు 242 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు.టీమిండియా బ్యాటింగ్‌లో రోహిత్‌శర్మ,కోహ్లీలు బాగా ఆడగా,ఆ మ్యాచ్ ద్వారా వన్డేలో అరంగేట్రం చేసిన హర్యానా మీడియం పేసర్ బరీందర్ స్రాన్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం టీమిండియా జట్టు బ్యాటింగ్ విభాగంలో బలంగా కనబడుతున్నా,బౌలింగ్ విషయంలో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు.కాగా టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఫర్వాలేదని పించినా,ఉమేష్ యాదవ్,భువనేశ్వర్ కుమార్ పేస్‌కు అనుకూలించే పిచ్‌లో కనీసం ఆడలేదు.తొలి వన్డేలో ఇషాంత్ శర్మను పక్కకు పెట్టడం కూడా ఓటమికి కారణమనే విమర్శలు వినిపించాయి.కాగా నేడు బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండవ వన్డే జరుగనుంది.కీలకమైన రెండవ వన్డేకు భారత పేసర్ ఇషాంత్‌శర్మ ఆడే అవకాశలు కనిపిస్తున్నాయి.బ్రిస్బేన్ కూడా పెర్త్ మాదిరిగా ఫాస్ట్ పిచ్ కావడంతో ఇషాంత్‌ను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది.ఇప్పటికే తాను రెండవ వన్డేకు ఫిట్‌గా ఉన్నట్లు ఇషాంత్ ప్రకటించడంతో అతని ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.ఒకవేళ ఇషాంత్‌ను జట్టులోకి తీసుకుంటే భువనేశ్వర్,ఉమేష్యాదవ్లలో ఒకరిని పక్కన పెట్టక తప్పదు.ఇక స్పిన్నర్లలో జడేజా,అశ్విన్ రెండవ వన్డేలో ఆడే అవకాశం ఉంది.