జంక్‌ఫుడ్‌కి దూరం

LADY-EAT
మీరు ముఖం మీద మొటిమలు, మచ్చలతో అందవిహీనంగా, కళావిహీనంగా తయారయ్యారా? అయితే ముందు చాక్లెట్లు, చిప్స్‌ తినే అలవాటు వదులుకోండి. ముఖాన్ని పాడుచేసే మొటిమలకు ఇవే ప్రధాన కారణం. మానసిక ఒత్తిడి, ఆందోళన మరో కారణం. తాజా పరిశోధనలు ఈ విషయాలనే చెబుతున్నాయి. ముఖ్యంగా టీనేజర్లను బాధించే ఈ మొటిమల సమస్యపై నార్వే రాజధాని ఓస్లో యూనివర్శిటీ ఈ పరిశోధనను చేపట్టింది. మొటిమలు, ఆహారం, మానసిక ఆరోగ్యపరిస్థితులపై మహిళలు, పురుషులపైనా ఈ బృందం అధ్యయనం చేసింది. సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి అనారోగ్యం దరిచేరదన్న వాస్తవం దీనికీ వర్తిస్తుంది. ఆహారానికి, మొటిమలు రావడానికి మధ్య లోతైన సంబంధం ఉందని ఈ పరిశోధనలు స్పష్టం చేశాయి. తాజా, పచ్చికూరగాయలు తీసుకునేందుకు బాలికలు విముఖత చూపిస్తున్నారు. ఈ కారణంగా మొటిమలు రాకుండా అడ్డుకునే గ్లూకోజ్‌స్థాయిలో తేడాలు వస్తున్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అలాగే మానసికమైన ఒత్తిడి ఆందోళన కూడా మొటిమలు మచ్చలు రావడానికి కారణమవుతున్నాయి. మంచి ఆహారం తీసుకున్నా మానసికమైన సమస్యలు వేధిస్తుంటే మొటిమల బారిన పడక తప్పదని ఈ పరిశోధన తెలియజేసింది.