చెట్ల నరికివేత పర్యావరణానికి చేటు

ప్రజావాక్కు

environment
environment

చెట్ల నరికివేత పర్యావరణానికి చేటు

ఈ మధ్యకాలంలో అనేక చోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమాల్లో భాగంగా అడ్డంగా ఉన్న చెట్లను నరికివేస్తున్నారు. మిషన్‌ భగీరథ పైపు లైన్లు వేసే చోట్ల చెట్లు ఉంటే వాటిని కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. గ్రామాల్లో ఇండ్లనిర్మాణం, గ్రామపంచాయితీల భవన నిర్మాణా లు కూడా జరుగుతున్నాయి. వీటికి అడ్డం వస్తున్నాయనే ఉద్దేశంతో ఎదిగిన చెట్లను నరికివేస్తున్నారు. ఇలాంటి చర్యలు పర్యావరణానికి చేటు తెస్తాయి. చెట్లను నరికివేయడం తప్పని సరి అయిన పరిస్థితుల్లో సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం అందుకు పరిహారంగా ఆ పరిసర ప్రాంతాల్లోనే పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలి.హరితహారం కార్యక్రమం ఏడాదికొక్కసారి కాకుండా ఏడాదంతా నిరంతరం జరగాలి. నాటిన మొక్కలను నూటికి నూరు శాతం రక్షించాలి.
-జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

విజ్ఞప్తులు బేఖాతరు
విశాఖ వాసులకు మరింత సౌకర్యం, సౌలభ్యం కోసం అదనపు రైళ్లను ప్రవేశపెట్టాలని స్థానిక ఎంపిల విజ్ఞప్తులను రైల్వేశాఖ బేఖాతరుచేస్తోంది. ముఖ్యమైనమూడు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ తిరుపతి-వారణాసి- విశాఖల మధ్య, ఉత్తర కోస్తా జిల్లాలను అనుసంధానం చేస్తూ గుంటూరు- ఆముదాల వలస మధ్య ఓవర్‌నైట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-యశ్వంత్‌పూర్‌ మధ్య డైలీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-ఉజ్జయిని మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌,విశాఖ-పాల్‌ఘాట్‌- కన్యాకుమారిల మధ్య వారానికి మూడు రోజులు, విశాఖ-న్యూఢిల్లీల మధ్య ఎసి ఎక్స్‌ప్రెస్‌లో సామాన్యుల కోసం నాన్‌ ఎసి కోచ్‌లు ఇత్యాది కొత్త రైళ్ల విషయంలో విశాఖ ప్రాంత వాసుల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పార్టీలకతీతంగా ఎంపిలు కృషి చేస్తున్నా రైల్వేజోన్‌ విషయం లాగే అదనపు రైళ్ల డిమాండ్‌ను కూడా రైల్వేశాఖ బుట్టదాఖలు చేయడం బాధాకరం.

-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

మరుగుదొడ్ల నిర్మాణంలో జాప్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలన్న ప్రభుత్వం సదాశయం కాంట్రాక్టర్ల చేతివా టం,అధికారుల పర్యవేక్షణలోపంతో నీరుకారుతోంది. న ల్గొండ,సూర్యాపేట జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛ ´భారత్‌ పథకంలో భాగంగా 2016 సంవత్సరంలో 5వేల మరుగుదొడ్లను ప్రభుత్వం మంజూరు చే సింది. రెండేళ్లు కావస్తున్నా 50 శాతం నిర్మాణం కూడా పూర్తి కాలేదు.

-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

=
కాలుష్యాన్ని నివారించాలి
హైదరాబాద్‌ మహానగరంలో కాలుష్యం ప్రమాదస్థాయిలో ఉంది.నానాటికీ పెరుగుతున్న జనాభా,తదనుగుణంగా రోడ్డెక్కు తున్న వాహనాలు వెదజల్లే కాలుష్యం, కాలం చెల్లిన వాహనాల ను నడపడం, పేరుకుపోతున్న చెత్త, అక్కడక్కడ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కూడిన చెత్తను తగలబెట్టడం, పరిశ్రమల నుంచి వచ్చేవ్యర్థాలు తదితర కారణాల వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఇది మానవారోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నది.

-సరికొండశ్రీనివాసరాజు, వనస్థలిపురం

బిజెపికి బొటాబొటి మెజార్టీ
దళితులు, మైనార్టీలపై దాడులు చేస్తూ వారిని హతమారుస్తు న్న సంఘటనలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. మహిళలు,యువతులు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారా లు లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవ్ఞ తుంది. యువతకు ఉద్యోగాలు లేవు. ధరలు తగ్గడం లేదు. పెరగడమే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో ఎన్నో సమస్యలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలుగుజరాత్‌ ఎన్నికలపై ప్రభావం చూపాయి. అందు వల్లనే ఆ రాష్ట్రంలో బిజెపికి మెజార్టీ స్థానాలు తగ్గాయి.
-మిథునం, హైదరాబాద్‌

నేపాల్‌-చైనా సన్నిహితం
నేపాల్‌లో కె.పి.జోలీ నేతృత్వంలోని వామపక్ష పార్టీల కూటమి ఇటీవలి ఎన్నికలలో విజయం సాధించడం భారత్‌కు ఒకింత ఆందోళన కలిగించే విషయం. ఈ ఎన్నికలలో నేపాలీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజాస్వామ్య కూటమికి భారత్‌ మద్దతు పలుక గా ఈ కూటమి ఘోరంగా పరాజయం పాలైంది. చైనా మద్దతు నిస్తున్న వామపక్ష కూటమి విజయదుందుభి మోగించడం నేపాల్‌- చైనా దేశాల మధ్య సన్నిహితసంబంధాలు మెరుగు పడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.దీంతో భారత్‌తో సత్సం బంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని స్వయంగా నేపాల్‌ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
-ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

కొరవడిన విద్యాధికారుల పర్యవేక్షణ
రాష్ట్రప్రభుత్వం సర్కారు పాఠశాలలను బలోపేతం చేస్తూ అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుంది. చాలా మంది పేద విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువ్ఞకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వపాఠశాలల్లో పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
-గుండమల్ల సతీష్‌కుమార్‌, నారాయణపురం