చుక్క పడని బిందు సేద్యం

drip irrigation
drip irrigation

నిధులు లేవంటున్న అధికారులు
పెండింగ్‌లో 1.20 లక్షల దరఖాస్తులు
ఆందోళనలో రైతాంగం
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ బిందు, తుంపర్ల సేద్యం ముందుకు సాగడం లేదు. నిధులు లేవంటూ బిందు, తుంపర్ల పరికరాల నిమిత్తం రైతులకు ఇచ్చే రాయితీల మంజూరు పత్రాల పంపిణీని నిలిపివేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ దాదాపు 1.20 లక్షల మంది రైతులు ఈ రాయితీల కోసం దరఖాస్తులిచ్చినా ఉద్యాన శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతాంగం ఆందోళన చెందుతోంది. వర్షాభవ పరిస్థితుల నేపథ్యంలో పలువురు రైతులు బిందు సేద్యంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే నిధులు లేవనే పేరుతో ఉద్యాన శాఖ దరఖాస్తుల మంజూరును పెండింగ్‌లో ఉంచింది. ఖరీఫ్‌ పూర్తయి ప్రస్తుతం రబీ సీజను సాగుతున్నా ఇప్పటి వరకూ బిందు సేద్యం నిమిత్తం వచ్చిన దరఖాస్తులను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో పూర్తవుతున్నా మంజూరు పత్రాలు ఇవ్వడం లేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 750 కోట్ల రూపాయలను మైక్రో ఇరిగేషన్‌ పథకం కింద రాయితీలు ఇవ్వాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. ఇందులో 300 కోట్ల రూపాయలను ప్రధాన మంత్రి కృషి సంచయి యోజన కింద కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేందుకు అగీకరించింది. దీనికి సంబంధించి 191 కోట్ల రూపాయలను కేంద్రం ఇటీవలే విడుదల చేసింది. ఈ నిధులకు తోడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కలిపి జిల్లాలకు ఉద్యాన శాఖ విడుదల చేయాల్సి ఉంది. అయితే నిధులు రాలేదని మైక్రో ఇరిగేషన్‌ పధకం మంజూరును తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు జిల్లా అధికారులు చెబుతుండడంతో రైతాంగం పరిస్థితి అయోమయంలో పడింది. మైక్రో ఇరిగేషన్‌ పథకం నిమిత్తం మంజూరు పత్రాలు ఇవ్వకపోవడంతో వాటి కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా రైతులు తిరుగుతున్నారు. రెండేళ్లుగా తెలంగాణలో నాబార్డు రుణంతో చేపట్టిన బిందు సేద్యం అమలు జరుగుతున్న తీరుతో ఈ ఏడాది 300 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఈ నిధులను రాష్ట్రానికి విడుదల చేయాలంటే అంతకుముందుగా మంజూరు చేసిన నిధులకు వినియోగ పత్రాలను సైతం సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా కేంద్ర నిధులను వాడుకోవాలంటే రాష్ట్రం వాటాను విడుదల చేయాలి. మైక్రో ఇరిగేషన్‌ పథకం కింద పరికరాలకు కంపెనీలకు గాను ఇచ్చేందుకు 191 కోట్ల రూపాయలను రాష్ట్ర వాటా కలిపి రైతులకు ఇచ్చినట్లుగా వినియోగ ధృవీకరణ పత్రాలు పంపితే మిగిలిన 109 కోట్ల రూపాయలను ఇస్తామని కేంద్రం రాష్ట్రానికి స్పష్టం చేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలియవచ్చింది. అయితే ఇప్పటి వరకూ అవే రైతులకు ఇవ్వనందున మిగిలిన సొమ్ము కేంద్రం నుండి వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు రావడం లేదని ప్రైవేటు కంపెనీలు రైతులకు బిందు, తుంపర్ల పరికరాలను గత కొంత కాలంగా ఇవ్వడం మానేశాయి. ఎంఐపీ అమలులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ నిబంధనల్లో తేడాల వల్ల నిధుల వినియోగంపై ప్రభావం పడుతోందని అంటున్నారు. ఒక రైతుకు 12.50 ఎకరాల పొలానికి పరికరాలు పెట్టడానికి అయ్యే వ్యయంతో 30 శాతం రాయితీగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బిసిలు, ఇతర వర్గాల సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీగా భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇచ్చే 30 శాతం పోను మిగిలినదంతా రాష్ట్రం ఇవ్వాల్సినందున నిధుల మొత్తం ఎక్కువగ ఆఉంటోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో తొలుత 54.97 కోట్ల రూపాయలనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ కేంద్రం 300 కోట్ల రూపాయలను ఇవ్వడానికి ముందు రాకవడంతో రాష్ట్రం భరించాల్సిన వాటా 450 కోట్ల రూపాయలకు పెరిగింది. బడ్జెట్‌లో ఇంత కేటాయింపు లేనందున ఇప్పుడు నాబార్డును మళ్లీ అప్పుగా అడుగుతున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్‌ కోసం దరఖాస్తులు చేసుకున్న పలువురు రైతులు అవి నెలల తరబడి మంజూరు కాకపోవడంతో వాటిపై క్రమేపీ ఆశలు వదులుకుంటున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రభుత్వం ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తోంది. అయితే అంతుకు అనుగుణంగా బిందు, తుంపర సేద్యాన్ని అమలు చేయడం లేదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగాను, బిసి, ఒసీ రైతులకు 90 శాతం రాయితీని ప్రకటించింది. అలాగే ఐదు నుండి పది ఎకరాల లోపు ఉన్న రైతులకు 75 శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్‌ను అమలు చేస్తోంది. ఈ లెక్కన ఎకరం పొంలం ఉన్న రైతులకు 50 వేల రూపాయలకు గాను 6 వేల రూపాయలు, ఐదు ఎకరాలకు లోపు భూమి ఉన్న రైతులకు 10 వేల రూపాయలు చెల్లిస్తే లక్ష రూపాయల విలువైన పరికరాలను అందిస్తారు. పదేళ్ల నుండి ప్రభుత్వ రాయితీ పొందని ప్రతీ రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన రైతులకు మైక్రో ఇరిగేషన్‌ పీడీ డ్రిప్పును మంజూరు చేస్తారు. దీంతో పలువురు రైతులు తుంపర, బిందు సేద్యంపై ఆసక్తి చూపుతున్నా, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు.