చిన్నారులపై అత్యాచార కేసులకు ప్రత్యేక చట్టాలు అవసరం

Supreme_Court
– పార్లమెంటులో ప్రత్యేక చట్టానికి కృషి చేయాలి : సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా

న్యూఢిల్లీ : పదేళ్లలోపు చిన్నారులు, పసికందులపై అత్యాచారాలు అత్యంత పాశవిక చర్యలకు అద్దంపడుతున్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంటులో ఇందు కోసం ప్రత్యేక చట్టం చేసి బాలికల శ్రేయస్సును పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీం బెంచ్‌ స్పష్టంచేసింది.నిందితులకు కఠిన తరమైన శిక్షలు అమలుచేసేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సూచించింది. దేశంలో మొట్టమొదటిసారిగా సర్వోన్నత న్యాయస్థానం పసికందులు, చిన్నపిల్లలు పదేళ్లలోపు వారికి మైనర్‌ స్థాయికంటే ప్రత్యేక స్థాయిగా పరిగణించి వారి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా మాట్లాడుతూ పార్లమెంటు ఇందుకు ప్రత్యేక చట్టం తెచ్చి బాలికలపై అత్యాచారం వంటి కేసుల్లో కఠిన శిక్షలు వేయాల్ని అవసరాన్ని నొక్కి చెప్పారు. చిన్నపిల్లలపై లైంగికవేధింపులు పాల్పడిన వారిని అవసరమైతే నపుంసకులుగా మా ర్చడం, లేదా అదనపు శిక్షలు వేయాలని కోరుతూ దాఖలైన రిట్‌పిటి షన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం న్యాయస్థానం ప్రత్యేక చట్టం చేయాలని కోరింది. ఈ అకృత్యాలద్వారా చిన్నపిల్లలకు కలిగే బాధ, వత్తిడి ఎవరికి తెలుస్తుందని, ఆవయసులో వారికి సెక్స్‌, రేప్‌ అంటే ఏమిటో కూడా తెలియదని ఈ వయసు చిన్నారులపై లైంగిక వేధింపులు అనేవి అత్యంత పాశవికమైన మానసిక చాంచల్యంగా పరిగణించాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. సమాజం ఈదిశగా ముందుకు కదిలి వీటికి అడ్డుకట్టవేయాలని అభిప్రాయపడ్డారు. బాధితులు ఎక్కువగా మూడు లేదా నాలుగేళ్ల లోపు వారే ఉంటున్నారని ఒకానొక సంఘటనలో 28 రోజుల పసి కందు కూడా ఉందని జస్టిస్‌ మిశ్రా ఎంతో కలవరం వ్యక్తం చేశారు. క్రూరత్వం తోను, అరాచకత్వంతోను విచక్షణకొరవడి చేస్తున్న నేరాలుగా పరిగణిం చి శిక్షలు మరింత కఠినంగా ఉండాల్సిందేనన్నారు. ఐపిసిలోని సెక్షన్‌ 376(2)(ఎఫ్‌) కేవలం 12ఏళ్లలోపు మహిళ అత్యాచారంపైనే చర్చిస్తోందని అన్నారు. పదేళ్లలోపు చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో ప్రత్యేక ప్రస్తావన ఏదీలేదని, పదేళ్లలోపు బాలికలపై అకృత్యాలకు పాల్పడేవారిపై శిక్షలు నిర్ధారించేందుకు ఈచట్టంలో ప్రత్యేక అంశం ఏమీ లేదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అటార్ని జనరల్‌ముకుల్‌ రోహతగి మాట్లాడుతూ బాలికలపై అకత్యాలు ఎన్నటికీ సహించరాని వని అన్నారు. ఒక నిర్దిష్టమైన, ప్రత్యేక చట్టం తెచ్చేందుకు సుప్రీం చేసిన సూచనలను ప్రభుత్వంముందు పెడతామని, పార్లమెంటులోనే ప్రత్యేక చట్టం చేసేందుకు ప్రభుత్వ దృష్టికి తెస్తామన్నారు. జస్టిస్‌ మిశ్రా మాట్లాడుతూ ఇటువంటి నేరాల్లో దోషులకు నపుంసకులుగా మార్చే అదనపు శిక్షను ప్రస్తావించడాన్ని నిరాకరించారు. న్యాయ వ్యవస్థ ఒకనేరానికి ఎప్పుడూ ఫలానా శిక్షనే వేయాలని ఎప్పుడూ నిర్ణయించదని చెపుతూ ఈ అంశం రాజ్యాంగ వ్యవస్థపరిధిలోనికి వస్తుందని జస్టిస్‌ మిశ్రా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల ప్రతినిధిగా సీనియర్‌ న్యాయవాది మహలక్ష్మిపావని చేసిన వాదనపై జస్టిస్‌ తీవ్రంగా స్పందించారు. బాలనేరస్తులకు గతంలో రక్షణ కల్పించారని, ఇపుడు బాలనేరస్తుల అకృత్యాలకుబలైన బాధితులకు రక్షణ కల్పించాలని, చిన్నారులపై లైంగికవేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు ఉండాలని పావని వాదించారు. అత్యాచారం కేసుల్లో చట్టాలకు మార్పులు చేర్పులు జరిగి కొన్ని కేసుల్లో రుజువైతే ఉరిశిక్షకు కూడా అవకాశం ఉండేవిధంగా చట్టాలకు మార్పులు జరిగిన తరుణంలో సుప్రీం కోర్టు సూచనలు ప్రకంపనలు సృష్టించాయి. చిన్నారులపై జరిగే అకృత్యాలను పరిరక్షించేందుకు 2012లో చేసిన పోక్సోచట్టం పరిధిలో లైంగిక కార్యకలాపాలకు అనర్హునిగా చేసేవిధంగా నిందితులకు శిక్షలు మార్చాలన్న వాదనలు పెరిగాయి. అందులోభాగంగానే సోమవారం సుప్రీం విచారణకు వచ్చిన ఓ కేసు సందర్భంగా జస్టిస్‌ మిశ్రా చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో చర్చలకు మార్గదర్శకం అయ్యాయి.