చిక్కుడు శనగపప్పు కట్‌లెట్‌

RUCHI-22
చిక్కుడు శనగపప్పు కట్‌లెట్‌

కావలసినవి
గోరుచిక్కుడు కాయలు-పావుకిలో, పచ్చిశనగపప్పు-వందగ్రా. నూనె-కప్పున్నర, ఉల్లిపాయలు-రెండు మామిడి అల్లం-చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు-ఎనిమిది లవంగాలు-ఎనిమిది, దాల్చినచెక్క-చిన్నముక్క కరివేపాకు-నాలుగు రెబ్బలు, జీలకర్ర-అరచెంచా పచ్చిమిర్చి-రెండు, ఉప్పు-రుచికి తగినంత
తయారుచేసే విధానం

ముందు రోజు లేదా రెండు గంటల ముందు శనగపప్పును నానబెట్టుకుని ఉంచుకోవాలి. గోరుచిక్కుడు కాయల్ని శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలు కోసి ఉడికించుకోవాలి. రంధ్రాల గిన్నెలోకి తీసుకుని వడకట్టుకోవాలి. తరువాత మామిడి అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి, జీలకర్రను తీసుకుని మిక్సీలో మెత్తని ముద్ద చేసుకోవాలి.

తరువాత శనగపప్పును రుబ్బుకోవాలి. మూడోసారి ఈ రెండింటినీ కలిపి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకును సన్నగా తరిగి పిండిలో కలపాలి. తరువాత ఉడికించిన గోరుచిక్కుడు కాయలు, రుచికి తగినంత ఉప్పును చేర్చాలి. పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. జావగా అయితే కొద్దిగా మైదా పిండి కలిపితే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టాలి. వేడయ్యాక పిండిని నచ్చిన ఆకృతిలో చేసుకుని నూనెతో రెండువైపులా కాల్చుకోవాలి.