చింద్వారా ఎయిర్‌పోర్టులో ఎంపీకి చేదు అనుభవం

చింద్వారా: పార్లమెంటేరియన్‌గా సుదీర్ఘ సేవలందిస్తూ వస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌కు చేదు అనుభవం ఎదురైంది. చింద్వారా విమానాశ్రయంలో ఓ కానిస్టేబుల్ ఆయనపై తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విషయం తెలిసిన వెంటనే సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్, రాజ్యసభ సభ్యుడు వివేక్ తాంఖా ట్విటర్లో కమల్‌నాథ్‌పై ఓ కానిస్టేబుల్ తుపాకీ ఎక్కుపెట్టిన విషయాన్ని పోస్ట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. ‘కమల్‌నాథ్‌పై చింద్వారా విమానాశ్రయంలో ఓ కానిస్టేబుల్ లోడెడ్ రైఫిల్ ఎక్కుపెట్టారు. ఇది విద్వేష రాజకీయమా? తీవ్ర స్థాయిలో ఖండిద్దామా?’ అని తంఖా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. భోపాల్‌కు 320 కిలోమీటర్ల దూరంలోని చింద్వారాలోని చిన్న ఎయిర్‌పోర్ట్‌లో ఈనెల 15న ఈ ఘటన జరిగింది. కాగా, చింద్వారా లోక్‌సభకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కమల్‌నాథ్ పార్లమెంటులో సుదీర్ఘ సేవలందిస్తున్నారు. చింద్వారా నుంచి ఆయన తొమ్మిది సార్లు ఎన్నికయ్యారు.