చర్చకు మేం సిద్ధం

KUTUMBARAO
KUTUMBARAO

చర్చకు మేం సిద్ధం

సచివాలయం: అమరావతి బాండ్ల జారీలో ఎలాంటి అవినీతి జరుగలేదని నిరూపిస్తే రాజీనామాకు సైతం సిద్ధమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సవాల్‌ విసిరారు. బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వడ్డీ అధికంగా ఇచ్చామని ప్రజల్లో అపోహలు కలిగించడం అమానుషమన్నారు. మీరు ఎప్పుడైనా సచివాలయంకుకానీ, విజయవాడకు అయినా రమ్మంటే వస్తానని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వాతావరణాన్ని కలుషితం చేయవద్దన్నారు. తామిచ్చిన వడ్డీకంటే తక్కువ వడ్డీ ఇస్తే డబుల్‌ అరేంజర్‌ ఫీ ఇస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 85 అరేంజన్‌ ఫీ ఇచ్చామని తక్కువ వడ్డీకి ఎవరు తీసుకొచ్చినా 1.70 అరేంజర్‌ ఫీ ఇస్తామన్నారు. ఇప్పటికే పలుమార్లు చెప్పానని ఇంతకంటే తక్కువ వడ్డీ ఉంటే చెప్పాలన్నారు. భారతదేశం రేటింగ్‌ ట్రిబుల్‌బి దగ్గర ఉందని వారం రోజుల నుంచి రూపాయి డాలర్‌కు 72.85 పైసలకు పడిపోయిందన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ బాండ్ల వడ్డీ కూడా పెరిగిపోయిందని అమరావతి బాండ్లు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ బాండ్ల వడ్డీ 7.35గా ఉందన్నారు. ఇప్పుడు వాటి వడ్డీ 8.18కి పెరిగిందనీ అందువల్లే అమరావతి బాండ్లకు 10.32 వడ్డీగా జారీ చేశామన్నారు. పనులు చేయకుండానే బిల్లులు చెల్లించామని మాజీ ఎంపీ ఉండల్లి ఆరోపించడం సరికాదని పట్టిసీమ ఇతర ప్రాజెక్టుల విషయాల్లో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. పేదల అపార్ట్‌మెంట్ల నిర్మాణంపై పూర్తిస్థాయిలో రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగిందని ప్రతిపక్ష సభ్యులు కూడా చర్చలో పాల్గొన్నారన్నారు. వైఎస్‌ అవినీతిపరుడు కాదని ఉండవల్లి అనడం విడ్డూరంగా ఉందని రాష్ట్రంలో అవినీతికి ఆజ్యంపోసింది వైఎస్‌ హయాంలోనేనని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు సి.కుంటుంబరావు అన్నారు.